Begin typing your search above and press return to search.

కేసీయార్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తోందా ?

By:  Tupaki Desk   |   22 Dec 2021 5:32 AM GMT
కేసీయార్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తోందా ?
X
తనను కలిసిన బీజేపీ నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. హోంశాఖ మంత్రితో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి+నలుగురు ఎంపీలతో పాటు మరికొందరు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణాలో బీజేపీ ఎదగాల్సిన అవసరాన్ని, అధికారం అందుకోవటానికి ప్రదర్శించాల్సిన దూకుడుపై షా నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు.

ఇదే సందర్భంగా సీఎం కేసీయార్ అవినీతికి సంబంధించిన అంశం తన దృష్టిలో ఉందని చెప్పారట. కేసీయార్ అవినీతి గురించి షా చెప్పిందే నిజమైతే మరి ఎందుకని ఇంతకాలం ఉపేక్షిస్తున్నారో అర్ధం కావటంలేదు. కేసీయార్ అవినీతి అంశం తన దృష్టిలో ఉన్నది నిజమే అయితే వెంటనే దర్యాప్తు సంస్ధలను ఎందుకు రంగంలోకి దింపి విచారణ చేయించటం లేదు. దేశంలో ఎవరెవరి మీదో సీబీఐ, ఐటీ, ఈడీ బృందాలు దాడులు చేసి కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నాయి కదా.

ఎలాగూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్న బీజేపీకి కేసీయార్ అవినీతి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ కదా. గడచిన ఏడేళ్లుగా కేసీయార్ పాల్పడిన అవినీతిని ప్రజల ముందుంచి కేసులు నమోదుచేసి దర్యాప్తు చేయించి జైలుకు పంపిస్తే ఇక బీజేపీకి తెలంగాణ లో ఎదురన్నదే ఉండదని అమిత్ షా కు తెలీదా ? అమిత్ షా మాత్రమే కాదు తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడినా బీజేపీ అధికారంలోకి రాగానే కేసీయార్ ను జైలు ఊచలు లెక్కించేట్లు చేస్తామని చెబుతునే ఉంటారు.

కేసీయార్ ను జైలుకు పంపుతామంటే అర్ధమేంటి ? సీఎం చేసిన అవినీతిపై విచారణ జరిపించి, నిరూపించి జైలులో వేస్తామనే కదా అర్ధం. అంటే కేసీయార్ అవినీతి మీద ఇప్పటికే బండి దగ్గర సాక్ష్యాధారాలున్నట్లే అనుకోవాలి. అవినీతిపై అన్ని సాక్ష్యాధారాలుంటే కేంద్ర దర్యాప్తు సంస్ధలను ఎందుకని ఇంకా రంగంలోకి దింపలేదు ? కేసులు నమోదుచేసి కేసీయార్ ను అదుపులోకి తీసుకుంటే ఒకపని అయిపోతుంది కదా.

అవినీతికి సంబంధించి అన్నీ అంశాలు తన దృష్టిలో ఉన్నాయని అమిత్ షా చెప్పటం, కేసీయార్ ను జైలు ఊచలు లెక్కపెట్టేట్లు చేస్తామని బండి చెప్పడం చూస్తుంటే ఇదంతా కేవలం బ్లాక్ మెయిల్ చేయటానికి మాత్రమే అని అర్ధమవుతోంది. కేసీయార్ అవినీతికి సంబంధించి నిజంగానే బీజేపీ లేదా కేంద్రం దగ్గర అధారాలుంటే ఊరికే వదిలి పెడుతుందా ? ఏమిటో ఈ గోల ఎక్కడి దాకా పోతుందో అర్థం కావటం లేదు. షెడ్యూల్ ఎన్నికలు ముగిసే సమయానికి ఇంకెంత గోల జరుగుతుందో చూడాల్సిందే.