Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలో కుర్చీ గణేషుడిదేనా... ?

By:  Tupaki Desk   |   8 Feb 2022 2:30 AM GMT
కొత్త జిల్లాలో కుర్చీ గణేషుడిదేనా... ?
X
రాజకీయాల్లో లెక్కలు చాలా ఉంటాయి. అక్కడ రెండూ రెండూ కలిస్తే నాలుగు అని చెప్పడానికి వీలులేదు. ఒకటి కూడా కావచ్చు. ఇదేమి లెక్కా అంటే అది ఫక్తు పాలిటిక్స్ లెక్క. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటు కొంతమందిలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోందిట. అంతే కాదు, అసలు ఊహించని విధంగా అందలం కూడా దక్కేలా చేస్తోంది అంటున్నారు.

విశాఖ జిల్లా మూడు భాగాలుగా చేశారు. అనకాపల్లి కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అయింది. రేపటి రోజున మంత్రి వర్గ విస్తరణ జరిగితే కొత్త జిల్లాలను బేస్ చేసుకునే ఎంపిక ఉంటుంది అన్నది నిజం. అలాగే జరుగుతుంది కూడా. అంటే 26 జిల్లాలూ, 26 మంది మంత్రులు అన్న మాట. ఈ లెక్కన అనకాపల్లి జిల్లాలో ఎవరికి మంత్రి పదవి అంటే నిన్నటిదాకా యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ పేరు అయితే బాగా నానింది.

ఇపుడు కూడా ఆయన రేసులో ఉన్నారు కానీ పోటీగా నర్శీపట్నం ఎమ్మెల్యే దూసుకువచ్చేస్తున్నారు. అలా అక్కడ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కి మంత్రి పదవి దక్కే సూచనలు అయితే ఉన్నాయని అంటున్నారు. కొత్త జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ తరఫున బలంగా ఉన్నారు.

ఆయన్ని తగ్గించాలీ అన్నా రాజకీయంగా వైసీపీ జిల్లాలో పై చేయి సాధించాలి అన్నా కూడా అక్కడ పట్టు తెచ్చుకోవాలి. ఆ విధంగా చూస్తే పెట్లకు మంత్రి పదవి దక్కేలా ఉందని చెబుతున్నారు. ఆయన బలమైన వెలమ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. పైగా పాతిక వేల పై చిలుకు ఓట్ల తేడాతో అయ్యన్నను ఓడించారు.

అంతే కాదు నర్శీపట్నాన్ని కొత్త జిల్లా చేయాలని డిమాండ్ ఉంది. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో జిల్లా చేయకపోయినా కొన్ని ఆఫీసులు అక్కడికి తరలించడం ద్వారా సమ న్యాయం చేస్తారు అంటున్నారు. దాంతో పాటుగా రాజకీయ వాటా కూడా ఇవ్వాలని చూస్తున్నారు. పెట్లకు కనుక మినిస్టర్ పోస్ట్ ఇస్తే ఆయన మరింతగా చెలరేగిపోవడమే కాదు, అయ్యన్న దూకుడుని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయగలరని వైసీపీ అధినాయకత్వం అంచనా వేస్తోందిట.

ఇక అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణలతో పాటు పార్టీ పరమైన అంశాలు కూడా అడ్డు వస్తున్నాయని అంటున్నారు. గుడివాడకు మంత్రి ఇస్తే అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వర్గం అపోజ్ చేస్తుంది అన్నది తెలిసిందే. ఇక ఆయనకు పోటీగా సీనియర్ ఎమ్మెల్యే, అదే సామాజిక వర్గానికి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు.

మరో వైపు చూస్తే కొత్త జిల్లాలు కనుక వస్తే విశాఖ నుంచి అవంతి శ్రీనివాసరావు పదవి సేఫ్. ఆయన ఒక్కరే అక్కడ గట్టిగా ఉన్నారు. పైగా కాపు సామాజికవర్గం నుంచి ఉన్నారు. ఇలా విశాఖలో ఆ సామాజిక వర్గానికి చాన్స్ ఇస్తే రూరల్ లో వెలమలకు అవకాశం ఉంటుంది అంటున్నారు. గతంలో టీడీపీ టైమ్ లో ఇదే రకంగా సామాజిక కూర్పు ఉండేది. ఇపుడు వైసీపీ అదే ఫాలో అవుతుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే కొత్త జిల్లాలు కాదు కానీ లక్ అటు గణేష్ కి ఫేవర్ చేసేలా ఉంది అంటున్నారు. చూడాలి మరి.