Begin typing your search above and press return to search.

మళ్ళీ లాక్ డౌన్ తప్పదా ?

By:  Tupaki Desk   |   19 Feb 2021 11:30 PM GMT
మళ్ళీ లాక్ డౌన్ తప్పదా ?
X
కరోనా వైరస్ దేశంలో మళ్ళీ విజృంభిస్తోందా ? ఇదే అనుమానం పెరిగిపోతోంది. కరోనా వైరస్ ప్రభావం మహారాష్ట్రలో రోజు రోజుకు పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజు రాష్ట్రం మొత్తం మీద సుమారు 4700 కేసులు, గురువారం 5 వేల కేసులు నమోదవ్వటం ప్రభుత్వాన్ని కలవర పెట్టేస్తోంది. ఇక ఫిబ్రవరి రెండోవారం నుండి ప్రతి రోజు సగటున 3500 కేసులు నమోదవుతోంది. దీంతో ప్రభుత్వంలో టెన్షన్ మళ్ళీ పెరిగిపోతోంది.

పెరిగిపోతున్న కరోనా వైరస్ సమస్యను కంట్రోల్ చేయటానికి ప్రభుత్వానికి ఏమి చేయాలో అర్ధం కావటం లేదు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉపయోగం కనబడటం లేదు. తగ్గిపోయిందని అనుకున్న వైరస్ మళ్ళీ విజృంభించటానికి ప్రధాన కారణం జనాల్లో పెరిగిపోయిన నిర్లక్ష్యమే అని అర్ధమైపోతోంది. లాక్ డౌన్ను మెల్లిగా సడలించిన దగ్గర నుండి జనాల్లో చాలామంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే నిర్భయంగా బయట తిరిగేస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య మళ్ళీ పెరిగిపోతోంది.

పెరిగిపోతున్న కేసులు ఎక్కువగా ముంబై, పూణే, నాగపూర్, థానె, అమరావతి నగరాల్లో నమోదవుతున్నాయి. కేసులు మరింత పెరిగిపోతే అరికట్టడం కష్టమని భావించిన ప్రభుత్వం వెంటనే అవకాశం ఉన్నచోట్ల మళ్ళీ లాక్ డౌన్ విధించేందుకు ఆలోచిస్తోంది. ముందుగా నైట్ కర్ఫ్యూ విధించటం, వివిధ ప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయటం, మాస్క్ లాంటి వాటిని ధరించేట్లు చూడటం లాంటి నిబంధనల గురించి ఆలోచిస్తున్నారు.

ఎన్ని నిబంధనలు విధించినా జనాలు పట్టించుకోకపోతే ఇక సంపూర్ణ లాక్ డౌన్ విధించటం ఒకటే మార్గమని ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే జనాలకు హెచ్చరికలాగ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. సీఎం హెచ్చరిక చేసినా జనాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకనే మళ్ళీ తొందరలోనే సంపూర్ణ లాక్ డౌన్ ఒకటే శరణ్యమని అనుకుంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.