Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ పాతదా? కొత్తదా?... అసలు నిజమేంటి?

By:  Tupaki Desk   |   26 March 2020 4:15 PM GMT
కరోనా వైరస్ పాతదా? కొత్తదా?... అసలు నిజమేంటి?
X
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్ కరోనాపై ఇప్పుడు లెక్కలేనన్ని కధనాలు వినిపిస్తున్నాయి. అసలు ఏ పత్రిక చూసినా... ఏ న్యూస్ ఛానెల్ చూసినా.. సాంత కరోనా కథనాలే కనిపిస్తున్నాయి. ఇది మినహా మరో వార్తే కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు... ఇప్పుడు కరోనా వార్తలను మించిన వార్తలు మరేమీ లేవని కూడా చెప్పాలి. యావత్తు ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా గురించి కాకుండా ఇంకే అంశం కూడా అంత ప్రాముఖ్యమైనదేమీ కాదని కూడా చెప్పాలి. ఇలాంటి తరుణంలో అసలు కరోనా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన వైరస్ కాదని, ఈ వైరస్ చాలా పాతదేనని, ఎప్పుడో 1960 దశకంలోనే ఈ వైరస్ ఎంట్రీ ఇచ్చిందని, దీనిపై అప్పుడే పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయని, ఆ విషయం మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఉందంటూ ఇప్పుడు కొత్త కొత్త సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి కూడా.

అయితే కరోనా వైరస్ పాతదేననే విషయంలో వాస్తవమెంత ఉందో చూద్దాం పదండి. కరోనా వైరస్ నిజంగానే పాత వైరసే. జనానికి ఇదివరకే సోకిన వైరస్సే. ఇందులో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. మరి అలాంటప్పుడు ఫ్లూ వైరస్ మాదిరి కరోనా అప్పుడెందుకు పెద్ద ఇష్యూగా మారలేదు? ఇప్పుడు ఎపిడెమిక్ గా మారిన వైనంలో అప్పుడు ఎందుకు ఇంతలా ప్రభావం చూపలేదు? మనం ఇప్పుడింతగా భయపడుతున్న రీతిలో అప్పుడు ఎందుకు భయాందోళనలు నెలకొనలేదు? ఇప్పుడు జనం ప్రాణాలను హరిస్తున్న స్థాయిలో అప్పుడు ఈ వైరస్ ఎందుకు ప్రభావం చూపలేదు? అయినా ఓ కలరా కావచ్చు... ఓ ఫ్లూ కావచ్చు... వాటి తరహాలో అప్పుడే ఈ వైరస్ ఎందుకు ఆ స్థాయిలో ప్రచారంలోకి రాలేదు? నిజమే... ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలను చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ వార్తలన్నింటికీ ఒక్కటే సమాధానం. కరోనా పాత వైరస్సే. అయితే కోవిడ్-19 అనేదే కొత్తది. అంటే కోవిడ్- 19.. కరోనా వైరస్ కదా? అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే... కరోనా వైరస్ లో చాలా దశలు - చాలా జాతులు ఉంటాయి కదా. ఆ దశలు, -జాతుల్లో మనలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న - భయపెడుతున్న కరోనా వైరస్ కోవిడ్- 19 జాతి అన్న మాట. ఇది కరోనా వైరస్ కు ఉన్న చాలా రూపాల్లో ఒకటన్న మాట. కరోనా జాతుల్లో అత్యంత ప్రభావం చూపగలిగిన జాతి అన్న మాట. అందుకే... ఇప్పుడు అటు కేంద్రం నుంచి వస్తున్న ప్రకటనలు గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న ప్రకటనల్లో కోవిడ్-19 అనే అంశం ప్రధానంగా వినిపిస్తోందన్న మాట. ఇప్పడు ప్రబలిన కరోనా వైరస్... దాని జాతుల్లోని కోవిడ్-19 అనే ఓ రకమన్న మాట. మొత్తంగా చెప్పాలంటే.. కరోనా వైరస్ పాతదే అయినా... ఇప్పుడు మనలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నది కూడా కరోనా అయినా.. అది దాని జాతిలోని కోవిడ్-19 అనే ఓ ప్రమాదకర రకమన్న మాట.