Begin typing your search above and press return to search.

మమతపై క్రేజు పెరుగుతోందా ?

By:  Tupaki Desk   |   8 Aug 2021 7:09 AM GMT
మమతపై  క్రేజు పెరుగుతోందా ?
X
హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్న మమత బెనర్జీకి దేశంలో క్రేజు పెరుగుతోందా ? అవుననే అంటున్నారు పరిశీలకలు. ఇందుకు ఆధారం ఏమిటంటే కేరళలో మమతకు మద్దతుగా పెద్దఎత్తున పోస్టర్లు వెలవటమే. కేరళలోని కొచ్చిలో దీదీకి మద్దతుగా చాలా పెద్ద వినైల్ పోస్టర్లు వెలిశాయి. ‘కాల్ దీదీ..సేవ్ ఇండియా..చలో ఢిల్లీ’ అని స్లోగన్లు రాసున్న పోస్టర్లు కొచ్చిలో చాలా చోట్ల వెలవటమే ఆశ్చర్యంగా ఉంది.

ఎందుకంటే మమతబెనర్జీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల్లో పరిచయం లేని పార్టీ అనే చెప్పాలి. అయితే మొన్నటి ఎన్నికల్లో నరేంద్రమోడి, అమిత్ షా ను గట్టిగా ఢీకొని హ్యాట్రిక్ సీఎం అనిపించుకోవటంతో దీదీ గ్రాఫ్ దేశంలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉత్తరాధి రాష్ట్రాల్లోనే కాకుండా దక్షణాది రాష్ట్రాల్లో కూడా మమతపై జనాల్లో ముఖ్యంగా మోడీ, బీజేపీ ని వ్యతిరేకిస్తున్న వారిలో దీదీ అంటే క్రేజ్ పెరిగిపోతోందట.

మోడీ ఢీకొని ఓడించే సత్తా ఒక్క మమతకు ఉందని జనాలు అనుకుంటున్నట్లున్నారు. అందుకనే కేరళలో కూడా దీదీకి మద్దతుగా పెద్ద పోస్టర్లు వెలిశాయి. ఒకప్పుడు అంటే 1970 దశకంలో ఇందిరాగాంధీకి మద్దతుగా కేరళలో ఇలాగే పోస్టర్లు వెలిశాయట. ఆ తర్వాత ఇందిర ప్రధానమంత్రి అయ్యారు. మరి యాదృచ్చికమో ఏమో కానీ మళ్ళీ ఇన్ని దశాబ్దాల తర్వాత మమతకు మద్దతుగా ఇదే కేరళలో పోస్టర్లు వెలిశాయి. దానికి తగ్గట్లే దీదీ కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది.

ఇక్కడ విచిత్రమేమిటంటే కేరళలో ఉన్నది సీపీఎం ప్రభుత్వం. సీపీఎం అంటే మమతకు ఒంటికి కారం రాసుకున్నట్లుంది. అయినా సరే కేరళలో దీదీకి మద్దతుగా జనాలు పోస్టర్లు వేయటమే ఆశ్చర్యంగా ఉంది. పోస్టర్ ఎవరు వేశారో తెలీదు కానీ కొచ్చిన్ లో చాలా పోస్టర్లు వెలవటమే ఆశ్చర్యం. మొత్తానికి రాబోయే రాజకీయ పరిణామాలకు కొచ్చిలో వెలసిన పోస్టర్లే సింబాలిజమా ? ఏమో ఎవరు చెప్పగలరు రాజకీయాలు ఏరోజు ఎలా మారిపోతాయో ?