Begin typing your search above and press return to search.

కులాల రొంపిలోకి జేడీ కూడానా.. ?

By:  Tupaki Desk   |   11 March 2022 1:30 AM GMT
కులాల రొంపిలోకి జేడీ కూడానా.. ?
X
ఆయన సీబీఐ జేడీగా ఉంటే కనిపించని నాలుగవ సింహం నడచివస్తున్నట్లుగా ఉండేది. ఒక అత్యున్నత పోలీస్ అధికారిగా ఆయన హీరో వర్షిప్ ని అప్పట్లోనే తన పనితీరుతో సొంతం చేసుకున్నారు. ఇక యువత ఆయన పట్ల విపరీతంగా అభిమానం పెంచుకున్నారు. ఒక ఐపీఎస్ అధికారికి కటౌట్లు పెట్టడం అన్న కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో ఆయనతోనే మొదలైంది అనుకోవాలి.

అంతటి క్రేజ్ సంపాదించుకున్న జేడీ కులమేంటి అని ఇప్పటికి పదేళ్ల క్రితం కొన్ని రాజకీయ పార్టీలు ఆరా తీయడమూ జరిగింది. దాని మీద అప్పట్లో ఒక డిబేట్ లో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ జేడీ సమర్ధంగా పనిచేస్తూ జగన్ కేసుల విషయంలో దర్యాప్తు చేస్తూంటే ఆయనను కూడా ఫలానా కులం అని కొన్ని పార్టీలు అంటగడుతున్నారని గుస్సా అయిన సందర్భం ఉంది.

అలాంటి జేడీ తరువాత కాలంలో తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు జనసేన తరఫున పోటీ చేసి రెండు లక్షల డెబ్బై అయిదు వేల ఓట్లకు పైగా సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక జేడీ ఆ తరువాత జనసేనకు రాజీనామా చేసి ఉత్తమ సమాజ ఆవిష్కరణ కోసం స్వచ్చందంగా అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలను యువత టార్గెట్ గా నిర్వహిస్తూ వచ్చారు.

మరి జేడీ అంటేనే కులాలు ప్రాంతాలకు అంతీతంగా అందరూ అభిమానిస్తారు. ఆయనను మేధావిగా చూస్తారు. అలాంటి జేడీ వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం కులాల రొంపిలోకి దిగుతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఆ మధ్య జరిగిన కాపు నేతల సమావేశంలో జేడీ పాల్గొంటే అందరూ ఆశ్చర్యపోయారు. జేడీ లాంటి ఇంటలెక్చువల్ పర్సన్ ఈ కులం బురదను అంటించుకోవడం ఏంటి అని కూడా అన్నారు.

అయితే ఇపుడు జేడీ మరో అడుగు ముందుకేసి విజయవాడలో జరిగిన ఏపీ బహుజన ఫ్రంట్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సభలో ఆయన మొత్తంగా కులాల గురించే మాట్లాడారు అంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఏపీ రాజకీయాలే కాదు, భారత దేశ రాజకీయాల్లో కులాలను పక్కన పెట్టి ఎవరూ ముందుకు సాగలేరు.

అలాగని అదే కొలమానం కూడా కాదు, గతంలో కులాల ప్రసక్తే లేకుండా చాలా మంది గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అలా ఆదర్శవంతమైన రాజకీయాలు ఎవరైనా చేయాలి. దాని కొరకు మేధావులు కూడా కృషి చేయాలి. అలా సాగాలంటే ఉన్నత విద్యావంతులు ఆ రొచ్చులో ఇరుక్కోకుండా ఉండాలి. కానీ జేడీ లాంటి మేధావులు కూడా కులం కార్డు లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించలేమని అభిప్రాయానికి వస్తున్నారా అన్నదే ఇపుడు డౌట్ గా ఉంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య తరచుగా జరుగుతున్న కాపు నేతల సమావేశంలో కూడా బహుజనులతో కలుపుకుని ఏపీలో రాజ్యాధికారం సాధించాలన్న భావన వ్యక్తం అయింది. మరి ఈ సమావేశాల్లో కీలకంగా ఉన్న జేడీ ఇపుడు బహుజనులను ఆ వైపుగా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. ఏపీలో కాపులతో పాటు బీసీలు, బహుజనులతో కూడిన విశాలమైన వేదిక ఏర్పాటు చేయాలన్నది చాలా కాలంగా సాగుతున్న ఒక ప్రయత్నం.

మరి దానికి కనుక జేడీ లాంటి వారు నడుం బిగిస్తున్నారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా రాజకీయాల్లో కులం, ధనం, కండ బలం లేని పారదర్శక వాతావరణం తీసుకురావాలని మేధావులు ఎపుడూ కోరుకుంటారు. కానీ ఇన్ని మాటలు చెప్పే వారు కూడా వెళ్ళి వెళ్ళి అదే బాట పడితేనే రాజకీయాల మీద జనాలకు మరింత విరక్తి కలిగే ప్రమాదం అయితే ఉంది. చూడాలి మరి జేడీ మనసులో ఏముందో.