Begin typing your search above and press return to search.

మహాకూటమి సాధ్యమేనా ?

By:  Tupaki Desk   |   24 Sept 2022 10:08 AM IST
మహాకూటమి సాధ్యమేనా ?
X
నాన్ బీజేపీ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఈనెల 25వ తేదీన బీహార్ సీఎం నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో సమావేశమవుతున్నారు. ఆదివారం జరగబోయే సమావేశం కీలకమైనదిగా అనుకోవాల్సుంటుంది. ఎందుకంటే నాన్ బీజేపీ పార్టీలను ఏకంచేసే ప్రయత్నాలు నితీష్ కారణంగానే ఊపందుకున్నాయి.

ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నాలే పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తెలంగాణా సీఎం కేసీయార్ కూడా చేశారు. అయితే వాళ్ళిద్దరికీ పెద్దగా క్రెడిబులిటీ లేని కారణంగా కొందరు సీరియస్ గా తీసుకోలేదు. సమస్య ఏమిటంటే వీళ్ళిద్దరు కూడా ఏరోజు ఎలాగుంటారు ? ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో కూడా ఎవరూ ఊహించలేరు. అందుకనే వీళ్ళ ప్రయత్నాలు పెద్దగా ముందుకు సాగలేదు. అయితే ఎన్డీయేలో ఉన్న నితీష్ బయటకు వచ్చేసి కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

ఎన్డీయేలో నుండి నితీష్ బయటకు రాగానే బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకంచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మమత, కేసీయార్ తో పోల్చినపుడు నితీష్ కు కాస్త క్రెడిబులిటి ఉందనే చెప్పాలి. పైగా తాను ప్రధానమంత్రి రేసులో లేనని, కేవలం బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకంచేయటం, బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించటమే టార్గెట్ అని చెప్పారు. దాంతో నితీష్ ప్రయత్నాలకు సానుకూలత వస్తోంది. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళను కూడా నితీష్ కలిశారు.

నాన్ బీజేపీ కూటమిలో చేరటానికి అందరు రెడీయే కానీ కాంగ్రెస్ తో చేతులు కలిపే విషయంలో మాత్రం మమత, కేసీయార్, కేజ్రీవాల్ ఇంతకాలం వెనకాడుతున్నారు. అయితే తాజా పరిణామాల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు మమత కూడా సిద్ధమయ్యారు.

కేజ్రీవాల్, కేసీయార్ కూడా ముందడుగు వేస్తే అప్పుడు మహాకూటమి ఏర్పాటుకు దాదాపు మార్గం ఏర్పడినట్లే అనుకోవాలి. ఒకసారి మహాకూటమి ఏర్పడితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నిసీట్లకు పోటీచేయాలనే విషయాలు కూడా సెటిలైపోతాయి. మరి నితీష్ ప్రయత్నాలు ఎంతవరకు సాగుతాయో చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.