Begin typing your search above and press return to search.

ఏపీలో మంకీ పాక్స్ భ‌యాందోళ‌న‌లు తొల‌గిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   18 July 2022 11:30 AM GMT
ఏపీలో మంకీ పాక్స్ భ‌యాందోళ‌న‌లు తొల‌గిన‌ట్టేనా?
X
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తొలిసారిగా అనుమానాస్పద మంకీ పాక్స్ కేసు భయాందోళనలను సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ కుటుంబంలోని చిన్నారికి మంకీ పాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో పాత ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌రలించారు. అలాగే కుటుంబాన్ని ఐసోలేష‌న్ ఉంచారు. కాగా ప‌రీక్ష‌ల్లో మంకీ పాక్స్ నెగెటివ్ అని తేలిందని ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేర‌కు సంబంధిత శాఖ‌ల కమిషనర్ జె. నివాస్ మాట్లాడుతూ.. దుబాయ్ నుంచి వ‌చ్చిన కుటుంబంలోని ఆ రెండేళ్ల బాలికకు సాధారణ చర్మం దద్దుర్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.

దుబాయ్ నుంచి వ‌చ్చిన చిన్నారికి మంకీ పాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఈ ప‌రీక్ష‌ల్లో నెగెటివ్ అని తేలింది. జూలై 11న ఆ కుటుంబం దుబాయ్ నుంచి విజయవాడకు తిరిగి వచ్చిన తర్వాత చిన్నారికి దద్దుర్లు వచ్చాయి.

దీంతో ఆమె తల్లిదండ్రులు మొద‌ట చిన్నారిని చిన్న‌పిల్ల‌ల వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. ఆయ‌న ఇది మంకీ పాక్స్ కావచ్చనే అనుమానంతో ప్రభుత్వాసుపత్రికి రిఫ‌ర్ చేశారు. ముఖంపైన‌ దద్దుర్లు ఎక్కువగా ఉన్న బాలికను పాత ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు హోమ్ ఐసోలేషన్‌లో పెట్టారు.

కాగా మ‌న‌దేశంలో జూలై 15న కేరళలో మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు బ‌య‌ట‌ప‌డింది. కేర‌ళలోని కొల్లాం జిల్లాకు చెందిన వ్య‌క్తి విదేశాల నుంచి వ‌చ్చాడు. మంకీ పాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆస్ప‌త్రిలో చేర‌గా... ప‌రీక్ష‌ల్లో మంకీ పాక్స్ అని వెల్ల‌డైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీ పాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వైరస్). ఈ ల‌క్ష‌ణాలు గతంలో మశూచి రోగులలో క‌నిపించేవి. అయితే మంకీ పాక్స్ సోకిన‌ప్ప‌టికీ తక్కువ తీవ్రతే ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ అడవి జంతువుల ద్వారా త‌ర్వాత‌ మనుషులకు సోకుతుంది.

వ్యాధి సోకిన జంతువుతో, ముఖ్యంగా జబ్బుపడిన లేదా చనిపోయిన జంతువుతో సన్నిహితంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ఆ వైర‌స్ మాన‌వుల‌కు వ్యాపిస్తుంది. ఇది జంతు మాంసం తిన్న‌వారికి వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేప‌థ్యంలో మాంసాన్ని తినడానికి ముందు దాన్ని బాగా పూర్తిగా ఉడికించాలని వెల్ల‌డించింది.