Begin typing your search above and press return to search.

ఎంపి గిలగిల్లాడిపోతున్నారుగా ?

By:  Tupaki Desk   |   14 Jun 2021 4:44 AM GMT
ఎంపి గిలగిల్లాడిపోతున్నారుగా ?
X
వైసీపీ అధికారిక వెబ్ సైట్లో నుండి తన పేరు తొలగించినందుకు నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు గిలగిల్లాడిపోతున్నట్లున్నారు. 48 గంటల్లో వెబ్ సైట్లో తన పేరు తిరిగి చేర్చకపోతే అది చేస్తానని ఇది చేస్తానని ఏకంగా జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో బెదిరిస్తున్నారు. అసలు పార్టీ వెబ్ సైట్ నుండి తన పేరు ఎందుకు తొలగించారో చెప్పాలట. కావాలనే తొలగించారా ? లేదా తనను పార్టీ నుండి బహిష్కరించారా ? లేకపోతే పొరబాటున పేరు మాయమైందా ? అనే విషయంపై తనకు 48 గంటల్లో క్లారిటి కావాలంటు లేఖలో అడగటం విచిత్రంగా ఉంది.

2019 ఎన్నికల్లో గెలిచిన కొంతకాలానికే పార్టీకి దూరమైపోయారు. అప్పటినుండి పార్టీ, ప్రభుత్వంపై తనిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తర్వాత కొంతకాలంగా జగన్నే డైరెక్టుగా ఎటాక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భావప్రకటన స్వేచ్చ, వ్యక్తి స్వేచ్చను అడ్డుపెట్టుకుని తానుమాత్రం జగన్ పైన, ప్రభుత్వంపైన ఏదైనా మాట్లాడచ్చు. అదే పార్టీ వెబ్ సైట్లో తన పేరు ఎందుకు కనబడటం లేదనే విషయంపై మాత్రం క్లారిటి కావాలట.

48 గంటల్లో తనకు క్లారిటి రాకపోతే తనను పార్టీ నుండి బహిష్కరించినట్లుగా భావిస్తారట. కాబట్టి తనను తాను స్వతంత్ర సభ్యునిగా ప్రకటించుకుంటారట. ఇదే విషయాన్ని లోక్ సభ సెక్రటేరియట్ కు తెలియజేస్తారట. తనను తాను రఘురామ స్వతంత్ర సభ్యునిగా ప్రకటించుకుంటే ఏమవుతుంది ? వైసీపీకి ఏమన్నా నష్టమా ? గడచిన ఏడాదికి పైగా పార్టీతో సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు కదా ?

జగన్+పార్టీ+ప్రభుత్వం విషయంలో ఎంపి ఎలా వ్యవహరిస్తున్నారో పార్టీ కూడా అలాగే వ్యవహరించాలని అనుకున్నట్లుంది. అందుకనే వెబ్ సైట్ నుండి ఎంపి పేరు మాయమైపోయింది. నిజానికి ఎంపి పేరు పార్టీ వెబ్ సైట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పార్టీ నియమావళికి కట్టుబడున్న ఎంపి లెవరు అధ్యక్షునికి, పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడరన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి వెబ్ సైట్లో ఎంపి పేరు మాయమైపోవటంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.