Begin typing your search above and press return to search.

పంచాయతీ ఎన్నికల సస్పెన్స్ ఇంకా మిగిలే ఉందా?

By:  Tupaki Desk   |   26 Jan 2021 1:30 AM GMT
పంచాయతీ ఎన్నికల సస్పెన్స్ ఇంకా మిగిలే ఉందా?
X
కొద్ది నెలలుగా ఏపీలో పంచాయతీ ఎన్నికల పంచాయతీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపింది. తాజా తీర్పుతో ఏపీ సర్కార్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ అన్న రీతిలో కొనసాగిన ఎన్నికల ఎపిసోడ్ కు ఈ రోజు సుప్రీం కోర్టు పుల్ స్టాప్ పెట్టిందని అంతా అనుకుంటున్నారు. అయితే, ఏపీలో పంచాయతీ ఎన్నికల సీరియల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ మిగిలే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బుధవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న ఓ పిటిషన్ వ్యవహారం తేలితేనే ఈ ఎన్నికల సీరియల్ దాదాపుగా పూర్తవుతుందని అనుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ విచారణపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. బుధవారం నాడు ఏపీ హైకోర్టు ఇచ్చే తీర్పుపై జగన్ సర్కార్ గంపెడాశలు పెట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటర్ల జాబితా సవరణ జరగలేదని, అందుకే 2021 ఓటర్ల జాబితా ఆధారంగా కాకుండా...2019 ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాయింట్ ఆధారంగానే ఏపీ హైకోర్టులో గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు.

నిమ్మగడ్డ ప్రకటన ప్రకారం ఏపీలో దాదాపు 3.5 లక్షలమంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి వేలాదిమంది యువత ఆసక్తిగా ఉందని, అటువంటిది కనీసం వారు ఓటు వేసే అవకాశమైనా కల్పించాలని అభిప్రాయపడ్డారు. కాబట్టి, కొత్త జాబితాను సిద్ధం చేసి, దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీని ఆదేశించాలని హైకోర్టుకు అఖిల విజ్ఙప్తి చేశారు.

ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో, బుధవారం నాడు హైకోర్టు వెలువరించే తీర్పు గురించి వైసీపీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ కాబట్టి, హైకోర్టు ఈ పిటిషన్ ను తీవ్రంగా పరిగణించి ఎన్నికలు వాయిదా వేసే అవకాశాలు లేవన్న అభిప్రాయలను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, పంచాయతీ ఎన్నికల పంచాయతీకి పూర్తి స్థాయిలో శుభం కార్డు పడాలంటే బుధవారం వరకు వేచి చూడక తప్పదన్న టాక్ వస్తోంది.