Begin typing your search above and press return to search.

పీఆర్సీ వివాదం ఇంకా ఉంది? ఎందుకంటే !

By:  Tupaki Desk   |   21 Feb 2022 3:30 PM GMT
పీఆర్సీ వివాదం ఇంకా ఉంది? ఎందుకంటే !
X
ఉద్యోగుల నూత‌న వేత‌న స‌వ‌ర‌ణ కు సంబంధించి న‌డుస్తున్న వివాదం ఇంకా కొన‌సాగుతునే ఉంది. అద్దెభ‌త్యం అమల్లో సంబంధిత శ్లాబుల్లో మార్పులు తెచ్చిన‌ప్ప‌టికీ ఆ విధంగా చూసుకున్నా తాము న‌ష్ట‌పోతున్నామ‌ని ఉపాధ్యాయులు ఆవేద‌న చెందుతూ, ల‌క్ష విన‌తుల ఉద్య‌మానికి నిన్న‌టి వేళ శ్రీ‌కారం దిద్దారు. ఉద్యోగులు త‌గ్గినా ఉపాధ్యాయులు మాత్రం త‌గ్గేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటుతామ‌ని, ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేదాకా నిద్ర‌పోబోమ‌ని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.

అయితే ఇలాంటి వాటికి తాను భ‌య‌ప‌డ‌బోన‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.తాను ఇవ్వాల‌నుకున్న మొత్తం త‌న ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌కు, ముఖ్యంగా ఖ‌జానాకు ఆర్థిక భారం అయిన‌ప్ప‌టికీ ఓకే చేశాన‌ని ఇంకా పెంచాల‌ని చెప్ప‌డం భావ్యం కాద‌ని అన్నారు. ఇదే మాట వైసీపీ శ్రేణులు కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ప‌దే ప‌దే జ‌గ‌న్ కోరుతున్నారు కూడా!

ఇదంతా డిపార్ట్మెంటల్ ఇష్యూ క‌నుక వీటిపై ఎమ్మెల్యే ధ‌ర్మాన మొదలుకుని మిగ‌తా నాయ‌కులు ఎవ్వ‌రూ పెద్ద‌గా స్పందించ‌డం లేదు. టీడీపీ కూడా తెలివిగా చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల‌పై పోలీసుల అణిచివేత గురించే మాట్లాడింది త‌ప్ప డీఏల‌పైనో, హెచ్ఆర్ఏపైనో పెద్ద‌గా స్పందించ లేదు.

తాజా పీఆర్సీ ప్ర‌కారం తాము ఆరు శాతం అద్దెభ‌త్యం కోల్పోతున్నామ‌ని ఉపాధ్యాయులు వేద‌న చెందుతున్నారు. ఒక‌ప్పుడు 30 శాతం ఉన్న హెచ్ఆర్ఏ కాస్త 24 శాతంకు చేరుకుంద‌ని, అంటే ఆరు శాతం త‌గ్గింద‌ని అంటున్నారు. అయితే ప్ర‌భుత్వం మాత్రం ఉద్యోగుల వాద‌న ఎలా ఉన్నా క‌రోనా కార‌ణంగా నెల‌కొన్న విచ్ఛిన్న పరిణామాలు, వ్య‌త్యాసాలు వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని మాట్లాడితే రాష్ట్ర సంక్షేమం, ప్ర‌యోజ‌నం అన్నింటినీ ఆశించిన వారు అవుతార‌ని హిత‌వు చెబుతోంది.

ఊరికే ఉద్య‌మాలు చేప‌డితే మాత్రం తాము ఒప్పుకోబోమ‌ని కూడా ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌ర్కారు ప‌రోక్ష సంకేతాలు ఇచ్చింది. ఎలానూ కొత్త డీజీపీ వ‌చ్చారు క‌నుక ఇక‌పై నోటికి వ‌చ్చిన విధంగా మాట్లాడినా, లేదా పాట‌లు పాడినా లేదా నిర‌స‌న‌ల్లో అదుపు త‌ప్పి ప్ర‌వ‌ర్తించినా వారిపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.