Begin typing your search above and press return to search.

చైనాలో తిరుగుబాటు మొదలవుతోందా ?

By:  Tupaki Desk   |   6 May 2022 10:51 AM GMT
చైనాలో తిరుగుబాటు మొదలవుతోందా ?
X
కలలో కూడా ఊహించని ఘటనలు చైనాలో మొదలయ్యాయి. జీరో కరోనా వైరస్ కేసుల కోసం డ్రాగన్ ప్రభుత్వం తన పౌరులపై ఆంక్షలను కఠినంగానే అమలు చేస్తోంది. ప్రపంచం ఏమనుకున్నా, ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా, మానవహక్కుల సంఘాలు ఎంతగా ఆక్షేపించినా చైనా ప్రభుత్వం లెక్కేచేయటం లేదు. కరోనా వైరస్ కేసుల నియంత్రకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుందో అంతకుమించే గట్టిగా ఉంటోంది.

ప్రభుత్వం అణచివేత చర్యలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఇపుడు చైనాలో పరిస్థితి ఎలా తయారైందంటే కరోనా వైరస్ కన్నా లాక్ డౌన్ సమస్యే తీవ్రమైపోయింది. ఎందుకంటే లాక్ డౌన్ పేరుతో షాంఘైతో పాటు మరికొన్ని నగరాల్లో డ్రాగన్ ప్రభుత్వం ప్రజలపై ఉక్కుపాదం మోపేసింది. జనాలను ఇళ్ళల్లో నుండి బయటకు రానీయకుండా తలుపులకు బయటనుండి సీల్ వేసేసింది. అలాగే అందరికీ నిర్బంధంగా కరోనా పరీక్షలు చేయిస్తోంది. దీన్ని జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బీజింగ్, షాంఘై నగరాల్లో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకునేందుకు జనాలు నిరాకరిస్తున్నారు. దాంతో వైద్యులు, ప్రభుత్వ సిబ్బంది బలవంతంగా జనాలు కాళ్ళు, చేతులను కట్టేసి లేకపోతే పదిమంది పట్టుకుని పరీక్షలు చేస్తున్నారు.

దీన్ని సహించలేక జనాలు బలవంతంగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రోడ్లపైన నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇలాంటివి చైనాలో జరుగుతాయని ఈ మధ్య కాలంలో ఎవరూ కలలో కూడా ఊహించలేదు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. అయితే పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తు మరింత మంది జనాలు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసుల వాహనాలకు అడ్డం పడుతున్నారు.

ప్రభుత్వానికి బానిసలుగా ఉండటానికి ఇష్టపడని వారంతా వెంటనే మేల్కోవాలంటు యువత గట్టిగా నినాదాలిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రభుత్వంపై జనాలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదనే అనుమానాలు మొదలయ్యాయి.