Begin typing your search above and press return to search.

రష్యా సైన్యం చేతులెత్తేస్తోందా ?

By:  Tupaki Desk   |   23 July 2022 5:40 AM GMT
రష్యా సైన్యం చేతులెత్తేస్తోందా ?
X
ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన ఐదు నెలల తర్వాత రష్యా చేతులెత్తేస్తోందా ? అవుననే అంటోంది బ్రిటన్. ఈ విషయాన్ని బ్రిటన్ స్పై చీఫ్ రిచర్డ్ మూరే అంచనా వేశారు. గడచిన ఐదునెలలుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నా ఇంతవరకు సంపూర్ణంగా ఆధిపత్యం సాధించలేకపోతోంది.

ఉక్రెయిన్ చిన్న దేశం కావటంతో, రష్యా అంటే పడని కారణంగా చాలా దేశాలు ఉక్రెయిన్ కు సాయంగా నిలిచాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లాంటి చాలా దేశాలు ఆర్ధికంగా, ఆయుధాల సరఫరాతో ఉక్రెయిన్ను ఆదుకుంటున్నాయి.

ఇన్నిదేశాలు సాయం అందిస్తున్న కారణంగా ఉక్రెయిన్ సైన్యాలు కూడా రష్యాపై తెగించే పోరాటాలు చేస్తున్నాయి. మామూలుగా అయితే రష్యా దెబ్బకు ఉక్రెయిన్ ఎప్పుడో మాడిమసైపోయేదే. వెనకాల ఇన్నిదేశాలు అండగా నిలబడిన కారణంగానే ఉక్రెయిన్ అత్యంతాధునిక ఆయుధాలతో గట్టిగానే తిరగబడుతోంది. ఇదే విషయమై మూరే మాట్లాడుతు సుదీర్ఘ యుద్ధం కారణంగా రష్యా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.

ఇప్పటికే 15 వేలమంది రష్యా సైన్యం మరణించిన విషయాన్ని మూరే గుర్తుచేశారు. ఇదే సమయంలో రష్యాకు సైన్యం కొరత మొదలైపోయిందన్నారు. అంతేకాకుండా రష్యా సైన్యానికి మెటీరియల్ కొరత మొదలైందని సమాచారం ఉందని, మెటీరియల్ సప్లై చేయటానికి ఏ దేశమూ ముందుకు రావటంలేదన్నారు. కాబట్టి రష్యా సైన్యాన్ని దెబ్బతీయటానికి ఉక్రెయిన్ కు ఇదే మంచి అవకాశంగా మూరే అబిప్రాయపడ్డారు.

ఇపుడు గనుక ఉక్రెయిన్ సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే రష్యాను పెద్ద దెబ్బ కొట్టచ్చని మూరే గట్టిగా చెప్పారు. అమెరికా అందించిన హిమార్స్ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్ సైన్యాలు వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తున్నాయి. అదునుచూసి రష్యా సైన్యాలపై దాడులు మొదలుపెడితే ఉక్రెయిన్ ఈజీగా గెలవచ్చని మూరే చెప్పారు.

ఈ దశలో ఉక్రెయిన్ సైన్యం తెగించి పోరాటంచేస్తే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని కూడా మూరే సలహాఇచ్చారు.