Begin typing your search above and press return to search.

ర‌ష్యా యుద్ధం ముగిసేనా ?

By:  Tupaki Desk   |   19 March 2022 7:37 AM GMT
ర‌ష్యా యుద్ధం ముగిసేనా ?
X
ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు ఎలా ఉన్నా కూడా యుద్ధం ఇప్ప‌ట్లో అయితే ఆగ‌దు.ఆపేందుకు ర‌ష్యా ప్ర‌య‌త్నాలు చేసినా కూడా అవి అనుకున్నంత త్వ‌ర‌గా ఫ‌లితాలు ఇవ్వ‌వు.బాధిత వ‌ర్గాల్లో ఇప్ప‌టికే చాలా మంది మ‌ర‌ణ శ‌య్య పై ఉన్నారు. భార‌త్ తో స‌హా ఇత‌ర ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ కు సాయం అందినా కూడా ఫ‌లితం లేకుండా ఉంది. ఈ ద‌శ‌లో ఎవ‌రి వారు త‌మ ప‌ట్టుద‌ల‌నో పంతాన్నో నెగ్గించుకుంటూ పోతే యుద్ధం ఆపేందుకు ఏమ‌యినా మ‌ధ్యేమార్గం ఉంటుందా? ఉండ‌దా? ఇదే ప్ర‌శ్న ప్ర‌పంచ దేశాల‌ను వేధిస్తోంది.

వాస్తవానికి ర‌ష్యా చేస్తున్న నిర్ణ‌యాలు జ‌రుపుతున్న దాడులు అన్న‌వి అత్యంత అమాన‌వీయంగా ఉన్నాయి. వీటికి అంత‌ర్జాతీయ స‌మాజం మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు.ఆర్థిక ఆంక్ష‌లు విధించి ర‌ష్యాను దార్లోకి తీసుకుని రావాల‌న్న ప్ర‌య‌త్నాలు షురూ అయినా కూడా ఈ మాట విన్నాక ఆ దేశ ప్ర‌జానికం విల‌విల‌లాడిపోతోంది. త‌మ సైన్యం చేస్తున్న చ‌ర్య‌ల‌ను అస్స‌లు ర‌ష్యా ప్ర‌జ‌లు అస్స‌లు అంగీక‌రించ‌డం లేదు.

ఎందుకు మొద‌ల‌యిందో యుద్ధం కానీ చాలా చోట్ల అత్యంత బాధాక‌ర స్థితిలో ఇరు దేశాల పౌరులూ అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. తిన‌డానికి తిండిలేక ఉక్రెయిన్ ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. అయినా కూడా శ‌ర‌ణార్థి శిబిరాల‌ను కూడా వ‌ద‌ల‌కుండా ర‌ష్యా దాడులు చేస్తోంది. నిన్న‌టి వేళ కీవ్, లీవీవ్ స‌హా ఇంకొన్ని న‌గ‌రాల‌పై ర‌ష్యా సేన‌లు విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడులు చేశాయి అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. ఆస్ప‌త్రులు,నివాసాలను కూడా పుతిన్ సేన‌లు ల‌క్ష్యంగా చేసుకున్నాయ‌ని ప్ర‌ధాన మీడియా వివ‌రిస్తోంది.

ఇంత జ‌రుగుతున్నా కూడా ర‌ష్యాను నిలువ‌రించే సాహ‌సం ఏ దేశ‌మూ చేయ‌లేక‌పోతోంది.భార‌త్ కూడా ప్రేక్ష‌క పాత్ర‌కే ప‌రిమితం అవుతోంది. అమెరికా చెప్పినా కూడా ఇవాళ ర‌ష్యా వినేందుకు సిద్ధంగా లేదు. పూర్తిగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాకే ర‌ష్యా యుద్ధం విరమించుకునేందుకు స‌న్న‌ద్ధం అవుతుందా అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయి.ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపేందుకు ఒకే ఒక్క ప్ర‌తిపాద‌న‌తో పుతిన్ వ‌ర్గం ముందుకు వెళ్ల‌నుంది.

రానున్న కాలంలో అటు యూరోపియ‌న్ యూనియ‌న్ లో కానీ ఇటు నాటోలో కానీ చేర‌మ‌ని ఉక్రెయిన్ చెబితే అందుకు త‌గ్గ హామీ ఇస్తే పుతిన్ యుద్ధం ఆపేస్తార‌న్న‌ది ఇవాళ ప్ర‌ధాన మీడియా చేస్తున్న వెల్ల‌డి.మ‌రోవైపు ఉక్రెయిన్ త‌ర‌ఫు నుంచి బేర‌సారాలు మొద‌ల‌య్యాయ‌ని, త‌మ దేశం నుంచి ర‌ష్యా సేన‌లు నిష్క్ర‌మిస్తే మిగిలిన విష‌యాలు మాట్లాడుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆ దేశ పాలక వ‌ర్గాలు భావిస్తున్నాయని మీడియా అంటోంది.

త‌మ భ‌ద్ర‌త‌కు ర‌ష్యా త‌గినంత భ‌రోసా ఇస్తేనే తాము సంబంధిత ఒప్పందాల‌కు ముందుకు వ‌స్తామ‌ని ఉక్రెయిన్ చెబుతోంద‌ని స్ప‌ష్టం చేస్తోంది.