Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో శివ‌సేన ప్ర‌భుత్వానికి ఇంకా ముప్పు తొలగలేదా?

By:  Tupaki Desk   |   22 Jun 2022 3:25 AM GMT
మహారాష్ట్రలో శివ‌సేన ప్ర‌భుత్వానికి ఇంకా ముప్పు తొలగలేదా?
X
మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. శివసేన రెబెల్ క్యాంప్ లో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. శివ‌సేన నేత‌, కేబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండే వెంట 22 మంది శివ‌సేన ఎమ్మెల్యేల‌తోపాటు మ‌రో 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలుస్తోంది. వారంతా ప్ర‌స్తుతం గుజ‌రాత్ లోని సూర‌త్ లో ఓ హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేశారు. శివ‌సేన.. కాంగ్రెస్, ఎన్సీపీల‌ను వ‌దిలిపెట్టి బీజేపీతో క‌లిసి సంకీర్ణ స‌ర్కారు ఏర్పాటు చేస్తేనే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని లేకుంటే త‌మ మ‌ద్ద‌తు బీజేపీకేన‌ని ఏక్ నాథ్ షిండే తేల్చిచెబుతున్న‌ట్టు స‌మాచారం.

కాగా తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేతో చర్చలు జరిపేందుకు మంత్రి మిలింద్ నర్వేకర్ ను మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూరత్ పంపారు. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాకరేకు ఫోన్ కలిపిన మిలింద్ నర్వేకర్.. షిండేతో మాట్లాడించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. తన వద్ద 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ముందుకొస్తే ఎలాంటి సమస్య ఉండబోదని, లేదంటే పార్టీలో చీలిక తప్పదని తెగేసి చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, తనకు ముఖ్యమంత్రి పీఠంపై కన్ను లేదని కూడా ఉద్ధవ్‌తో చెప్పినట్టు తెలుస్తోంది.

ఏక్‌నాథ్ డిమాండ్‌పై ఉద్ధవ్ మాట్లాడుతూ.. బీజేపీ గతంలో శివసేన నేతలను ఇబ్బందులకు గురిచేసిందని చెప్పారు. దీనికి షిండే బదులిస్తూ.. ఎన్సీపీ, కాంగ్రెత్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని తనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. బీజేపీతో పొత్తుకు వారు ఓకే అని, లేదంటే మాత్రం పార్టీలో చీలక తప్పదని స్పష్టం చేసినట్టు స‌మాచారం.

మ‌రోవైపు జూన్ 21న‌ అత్య‌వ‌స‌రంగా ఉద్ద‌వ్ ఠాక్రే ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల స‌మావేశానికి కేవ‌లం 33 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. మ‌హారాష్ట్రలో శివ‌సేన‌కు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

మ‌రోవైపు బీజేపీతో క‌ల‌సి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుండటంతో ఏక్‌నాథ్ షిండేపై శివసేన చర్యలు తీసుకుంది. ఆయ‌న‌ను పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా తొల‌గించింది. ఆ పదవిలో శివ్‌డీ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. వీటిలో శివసేన ఎమ్మెల్యే ఒకరు మరణించడంతో సంఖ్య 287కు తగ్గింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 144 ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

శివసేనకు 55 సీట్లు, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 106 సీట్లు ఉన్నాయి. ఒకవేళ మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీలో శివసేన సంఖ్య 33కి తగ్గనుంది. దీంతో సభలో మహా వికాస్ అఘాడి బలం 131కి తగ్గుతుంది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సభలో కొత్త మెజారిటీ మార్క్ 133 అవుతుంది. ఈ నేపథ్యంలో మెజారిటీ మార్కు కంటే ఎక్కువగా తమకు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ వాదిస్తోంది.

కాగా ఏక్ నాథ్ షిండే ప్ర‌స్తుతం అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ పబ్లిక్ వర్క్స్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కొడుకు డాక్టర్ శ్రీకాంత్ షిండే ప్రస్తుతం కల్యాన్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.