Begin typing your search above and press return to search.

ముద్రగడ లేకుండా వేదిక సాధ్యమేనా... ?

By:  Tupaki Desk   |   6 Feb 2022 11:30 PM GMT
ముద్రగడ లేకుండా వేదిక సాధ్యమేనా... ?
X
ఏపీలో ముద్రగడ పద్మనాభం అంటే గుర్తుకు వచ్చేది కాపుల ఉద్యమమే. ఆయన 1993 ప్రాంతంలోనే కాపులను బీసీలలో చేర్చాలని ఉద్యమాన్ని చేపట్టి నాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం నుంచి జీవోను సాధించారు. ఆ తరువాత చంద్రబాబు కాపులను బీసీలలో చేరుస్తామంటేనే ఆయన బయటకు వచ్చి ఉద్యమించారు. బాబు ఏలుబడిలో ముద్రగడ చేసిన ఉద్యమాలు ప్రభుత్వాన్ని గడగడలాడించాయి.

ఇక జగన్ సీఎం కాగానే ముద్రగడ సైలెంట్ అయ్యారు. దాంతో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకిగా ఒక వర్గం చిత్రీకరించింది. మరో వైపు కాపుల రిజర్వేషన్ మీద జగన్ ఏమీ హామీ ఇవ్వకపోయినా కూడా ముద్రగడ గట్టిగా అడగలేదని అనే వాళ్లు ఉన్నారు. అయితే జగన్ తన పాదయాత్రలో భాగంగా గోదావరి జిల్లాలలోనే అనేక సభలలో మాట్లాడుతూ రిజర్వేషన్లు కల్పించడం అన్నది తన చేతులలో లేదని, తాను చేయలేనని చెప్పేశారు. అందువల్ల ఆయన్ని అడిగి ప్రయోజనం లేదనే ముద్రగడ డిమాండ్ చేయలేదని అంటారు.

ఇక ఆ తరువాత ప్రత్యేకించి ఒక వర్గం వారు ముద్రగడను విమర్శించడంతో ఆయన కాపు ఉద్యమం నుంచే తప్పుకున్నారు. ఇక ఈ మధ్య ఆయన కాపులు, బీసీలు, ఎస్సీలతో ఒక విశాలమైన రాజకీయ వేదిక ఏర్పాటు కావాలని కోరుతూ ఆయా సామాజికవర్గ నేతలకు బహిరంగ లేఖలు రాశారు. ఇది అలా ఉండగానే మరో వైపు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీ నారాయణ, వట్టి వసంత్ కుమార్, ఇతర సీనియర్ కాపు నేతలలు కలసి వరసబెట్టి భేటీలు నిర్వహిస్తున్నారు.

ఈ నెల రెండవ వారంలో కూడా విజయవాడ వేదికగా భారీ సమావేశానికి కాపు నేతలు సిద్ధమవుతున్నారు. మరి ఈ సమావేశాలు జరుగుతున్నాయి కానీ ముద్రగడ పద్మనాభాన్ని పిలవడంలేదా లేక ఆయన్ని దూరం పెట్టారా అన్న చర్చ అయితే సాగుతోంది. మరో వైపు చూస్తే ముద్రగడ తానుగానే దూరం పాటిస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ముద్రగడ కాపులు బీసీలు, దళితులు కలవాలని కోరుకుంటూంటే కాపులతోనే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని మిగిలిన నాయకులు భావిస్తున్నారు. ఇది ఒక సిద్ధాంత వైవిధ్యంగా చూసినా కూడా కాపులకు ఐకాన్ లాంటి నేత ఉండగా ఆయన్ని పక్కన పెట్టి ఈ సమావేశాలు నిర్వహించడమేంటి అన్న మాట కూడా వినవస్తోంది. ఇంకో వైపు చూస్తే కాపు అనగానే ముద్రగడ మాత్రమే గుర్తుకు వస్తారు.

ఆయన తన రాజకీయ జీవితం మొత్తాన్ని త్యాగం చేసి కాపుల కోసం నిలిచారు. చంద్రబాబు టైన్ లో ఆయన ఏకంగా అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అలాంటి నేత, కష్టం నష్టం ఉద్యమంలో చూసిన వారు, రాజకీయంగా ఎలాంటి హోదాలను కూడా వద్దు అనుకున్న నేత, అవినీతి మచ్చ లేని నాయకుడు ఉండగా ఆయన్ని కాదని కాపు నేతలు సమావేశాలు పెట్టడం పట్ల సందేహాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తాను జగన్ని కలిస్తే కోవర్టు గా చిత్రీకరిస్తారు అని ముద్రగడ ఆయనకు తాజాగా రాసిన లేఖలో పేర్కొన్నారు. అది కూడా ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. ముద్రగడను కోవర్టు అనగలిగే వర్గం ఏది అయి ఉంటుంది అన్న ప్రశ్న కూడా వస్తోంది. మొత్తానికి ముద్రగడ బహుజన ఫ్రంట్ అంటున్నారు. అయితే దాని మీద కధ ఎంతదాకా వచ్చింది అన్నది తెలియడంలేదు.

మరో వైపు చూస్తే కాపు నేతలు ఈ మధ్య బాగా జోరు చేస్తున్నారు. మరి అక్కడ అయితే ముద్రగడ ప్రస్థావన లేదు, ఎన్ని చెప్పుకున్నా కూడా ముద్రగడ లేని కాపుల వేదికకు కళ వస్తుందా అన్నదే ఆ సామాజికవర్గంలోనూ ఎదురవుతున్న ప్రశ్న. ఆయన అభిమానులు అయితే తమ నేతను కావాలనే పక్కన పెడుతున్నారు అని మధనపడుతున్నారుట. మరి దీనికి సమాధానాలు తెలియాలీ అంటే మరికొంతకాలం ముందుకు సాగాలేమో.