Begin typing your search above and press return to search.

టీడీపీ పరిస్ధితి మరీ బ్యాడుగా ఉందా ?

By:  Tupaki Desk   |   29 Aug 2021 1:30 AM GMT
టీడీపీ పరిస్ధితి మరీ బ్యాడుగా ఉందా ?
X
‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకి 50 సీట్లకు మించి రావు’..ఇది వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు చెప్పిన జోస్యం. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కన్నా తనకే జనాల మద్దతు ఎక్కువగా ఉంది అని చెప్పకోవటంతోనే సర్వే క్రెడిబులిటి ఏమిటో జనాలకు అర్ధమైపోయింది. 9 లక్షల మందిని ఐవీఆర్ఎస్ పద్ధతిలో సర్వే చేయిస్తే జగన్ కన్నా తనకే 19 శాతం జనాల మద్దతు అధికంగా ఉందని తేలిందని ఎంపి చెప్పుకున్నారు. సరే ఎవరు చేయించిన సర్వేలో ఫలితాలు వాళ్ళకే అనుకూలంగా రావటంలో ఆశ్చర్యం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నరసాపురంలో ఐవీఆర్ఎస్ పద్దతిలో సర్వే చేయించినట్లు చెప్పిన తిరుగుబాటు మిగిలిన రాష్ట్రంలో ఏ పద్దతిలో సర్వే చేయించారో చెప్పలేదు. మొత్తానికి వైసీపీకి 50 సీట్లకన్నా రాదని తేల్చిచెప్పిన ఎంపి మరి టీడీపీ పరిస్ధి ఏమిటో చెప్పాలి కదా. వైసీపీ పరిస్దితిపై సర్వే చేయించిన రాజు తెలుగుదేశం పార్టీ పరిస్దితి పైన కూడా సర్వే చేయించే ఉంటారు కదా.

సర్వే చేయించకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడు కి 60 శాతం పాజిటివిటి ఉందని చెప్పే అవకాశం లేదు. అలాగే పుంగనూరు, భీమవరం నియోజకవర్గాల్లో కూడా సర్వే చేయించారు కాబట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గ్రంధి శ్రీనివాస్ కు జనాలు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. మరి ఇంత చెప్పిన తిరుగుబాటు ఎంపీ తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఏమిటి ? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఎందుకు చెప్పలేదు ?

ఎందుకంటే టీడీపీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది కాబట్టే. 2019లో తగిలిన ఘోరమైన దెబ్బ నుంచి టీడీపీ ఇప్పటివరకు కోలుకోనేలేదు. పైగా అప్పటితో పోల్చుకుంటే తర్వాత కొందరు సీనియర్ నేతలు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్లల్లో కూడా చాలామంది బీజేపీలోకో లేకపోతే వైసీపీలోకో జంప్ చేయటానికి రెడీగా ఉన్నారు. అయితే అవకాశం రాని కారణంగా మాత్రమే టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుగనుకే తిరుగుబాటు ఎంపీ టీడీపీకి రాబోయే సీట్ల గురించి నోరిప్పటం లేదు.