Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ లో టీడీపీ టీంకే పెత్తనమా..?

By:  Tupaki Desk   |   20 April 2021 7:40 AM GMT
టీఆర్ఎస్ లో టీడీపీ టీంకే పెత్తనమా..?
X
తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ కు తిరుగులేదని గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపితమైంది. అదే జోష్ లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా తమ ఖాతాలో వేసుకోవాలని సీఎం కేసీఆర్ సైతం ఇక్కడికి ప్రచారానికి వెళ్లారు. సాగర్ లోనూ గెలుపు గ్యారెంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో మరికొన్నేళ్లు టీఆర్ఎస్ హవా కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక త్వరలో వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల బరిలో దిగేందుకు గులాబీ దండు సిద్ధమవుతోంది. ఇక్కడి స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని ఇప్పటికే ఆయా మంత్రులను సీఎం కేసీఆర్ సమాయత్తం చేస్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికలో పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నట్లు సమాచారం. పార్టీకోసం పనిచేసిన వారికంటే మధ్యలో వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు టీఆర్ఎస్ సీనియర్ నేతలు వాపోతున్నారు.

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై టీఆర్ఎస్ నజర్ పెట్టింది. మేయర్ అభ్యర్థిగా గుండు సుధారాణి పేరు ఇక్కడ వినిపిస్తోంది. ఈమె టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2016లో గులాబీ కండువా కప్పుుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ టీంగా చెప్పుకుంటారు. ఎర్రబెల్లి దయాకర్ తో సమా వీరంతా టీడీపీలో ఓ వెలుగు వెలిగిన వారు కావడం గమనార్హం. అంతేకాకుండా టీఆర్ఎస్ లోకి వచ్చే ముందు ఆమె టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీలో పదవులు అనుభవించిన వాళ్లు, మంత్రికి అనునాయులకే అత్యున్నత పదవులు వస్తున్నాయని కొందరు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచి పార్టీని పట్టుకొని పనిచేస్తున్న నాగుల వెంకటేశ్వర్ రావు తనకు అన్యాయం జరుగుతోందని అయోమయానికి గురవుతున్నారు. ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్న తనకు మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ఇప్పటికే హామీ ఇచ్చారని.. ఇప్పుడు పార్టీలోకి మధ్యలో వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

మరోవైపు వరంగల్ జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సోదరుడు అయిన విజయ్ భాస్కర్ కూడా మేయర్ పదవి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రస్తుత వార్తలతో ఆయన నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధారాణిలు తెలంగాణ కోసం ఏమాత్రం ఉద్యమం చేయలేదని, పైగా ఆ సమయంలో వారు పదవుల్లో ఉంటూ ఎంజాయ్ చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నిజంగా తెలంగాణ కోసం పోరాడినోళ్లకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.