Begin typing your search above and press return to search.

మండలానికో ఏసీబీ కార్యాలయమా ?

By:  Tupaki Desk   |   21 April 2022 4:59 AM GMT
మండలానికో ఏసీబీ కార్యాలయమా ?
X
అవినీతి అంతం మనపంతం అని తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిజ్ఞ బాగుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి అన్నమాటే వినిపించకూడదని గట్టిగా చెప్పారు. ప్రభుత్వ ఆపీసుల్లో లంచాలన్న మాటే వినబడకూడదని వార్నింగ్ ఇచ్చారు.

ఇందుకోసం ఏసీబీకి ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేయాలని ఆదేశించారు. నెలరోజుల్లోపు తయారయ్యే యాప్ లో వీడియో, ఆడియోతో పాటు డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు.

సరే అవినీతి అంతానికి జగన్ చేసిన సూచనలు, ఆదేశాలు బాగానే ఉన్నాయి. అయితే అవినీతి అంతానికి ఏసీబీ వ్యవస్ధ మండలం స్ధాయిలో కూడా ఏర్పాటవ్వాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే జగన్ లెక్కప్రకారం ప్రతి మండలంలోను ఒక ఏసీబీ ఆపీసు ఏర్పాటు చేయాలని అర్ధమొస్తుంది. మండలానికి ఒక ఏసీబీ ఏర్పాటుచేస్తే వెంటనే అవినీతి అంతమైపోతుందా ? అసలు ప్రతి మండలంలోను ఒక ఏసీబీ ఆఫీసు అవసరమా ? అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న.

ఇప్పటికే జిల్లాలో ఒక ఏసీబీ ఆఫీసు ఉన్నది. దానిలో కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. మరి జిల్లాల్లో అవినీతి ఎంతతగ్గింది ? ఇక్కడ విషయం ఏమిటంటే మండలానికి ఒక ఏసీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. జిల్లా స్ధాయిలో ఉన్న ఏసీబీ కార్యాలయాల్లోనే అధికారుల సంఖ్యను పెంచితే సరిపోతుంది. సమర్ధులైన అధికారులను నియమించి, సిబ్బంది సంఖ్య పెంచి వాళ్ళకు ఇవ్వాల్సిన సౌకర్యాలను అందిస్తే వాళ్ళే జిల్లా అంతా చూసుకుంటారు.

కార్యాలయాలను బలోపేతం చేయకుండా అవసరమైన అధికారులు, సిబ్బందిని ఇవ్వకుండా, అవసరమైన నిధులను విడుదల చేయకుండా పనిచేయమంటే ఎవరు పనిచేయలేరు. ఇంతోటిదానికి మండలస్ధాయిలో కూడా ఏసీబీ వ్యవస్ధను బలోపేతం చేయాలంటే ఎలా సాధ్యం ?

అసలు పోలీసు శాఖలో పనిచేస్తున్న వివిధ విభాగాల మధ్య సమన్వయం చాలా అవసరం. ఏసీబీ అయినా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అయినా మరోటైనా పోలీసు శాఖలో విభాగాలే. కాబట్టి అన్నీ విభాగాల్లోని అధికారుల మధ్య సమన్వయం ఉండేట్లు చూడాలి. ఏసీబీ అధికారులు అవసరానికి ఇతర విభాగాల్లోని సిబ్బందిని కూడా ఉపయోగించుకునే సౌకర్యం కల్పించాలి. ఇదంతా జరగాలంటే ముందు అన్నీ విభాగాల్లోను సిబ్బంది పెంచాలి. అలాగే పోలీసుల పనిలో రాజకీయనేతల జోక్యాన్ని తగ్గించాలి. అప్పుడు అవినీతి దానంతట అదే తగ్గుతుంది.