Begin typing your search above and press return to search.

మంగళవారం ఒక్కరోజులో హైదరాబాద్ మీడియాలో అంతమందికి పాజిటివ్?

By:  Tupaki Desk   |   10 Jun 2020 9:50 AM GMT
మంగళవారం ఒక్కరోజులో హైదరాబాద్ మీడియాలో అంతమందికి పాజిటివ్?
X
హైదరాబాద్ మీడియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడెక్కడో వూహాన్ లో పుట్టిన మాయదారి మహమ్మారి.. చూస్తుండగానే దేశానికి రావటం.. రాష్ట్రానికి రావటమే కాదు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లకు దగ్గర్లోనూ.. ఆఫీసుల్లోకి వచ్చేసింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పేర్కొనే డాక్టర్లు.. పోలీసులు.. మీడియా ఇలా ఎవరిని వదలట్లేదు. వైద్యులు.. పోలీసులతో పోలిస్తే.. మీడియా ప్రతినిధులకు పాజిటివ్ రావటం తక్కువే.

అలాంటిది ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న టీవీ5 స్థానిక రిపోర్టర్ మనోజ్ కు పాజిటివ్ రావటమే కాదు.. గాంధీవైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోయిన పరిస్థితి. ముప్ఫై ఏళ్ల చిరు ప్రాయంలోనే ప్రాణాలు పోయిన పరిస్థితి. చూస్తుండగానే.. మరికొన్ని మీడియా సంస్థలకు చెందిన వారికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో.. మీడియా వర్గాల్లో కలవరం మొదలైంది.

ఈ టెన్షన్ మరింత పెరిగేలా తాజాగా మరో సమాచారం బయటకు వచ్చింది. మంగళవారం ఒక్కరోజులోనే వివిధ మీడియా సంస్థలకు చెందిన పలువురికి పాజిటివ్ గా వచ్చినట్లు తేలుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈటీవీ కెమెరామెన్ కు.. ఎబీఎన్ టెక్నిషియన్ కు..10టీవీకి చెందిన ఇద్దరు కెమేరామెన్లు.. మహా టీవీకి చెందిన రిపోర్టర్ కు పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో.. మీడియా వర్గాల్లో మహమ్మారి ఒత్తిడి పెరిగిపోతోంది. ఇప్పటికే పలు మీడియా సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టటం.. ఉద్యోగుల్ని తొలగించటం లాంటి నిర్ణయాలు తీసుకుంటే.. మరోవైపు ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేయాల్సి వస్తుందన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.