Begin typing your search above and press return to search.

తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా.. ష‌ర్మిల‌కు గులాబీనేత‌ కౌంట‌ర్‌!

By:  Tupaki Desk   |   10 Feb 2021 12:30 PM GMT
తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా.. ష‌ర్మిల‌కు గులాబీనేత‌ కౌంట‌ర్‌!
X
తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ స్థాపించ‌బోతున్న‌ట్టు వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌క‌టించ‌డం మాత్ర‌మే కాదు.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఇక్క‌డ రైతుల‌తోపాటు ఏ వ‌ర్గానికి కూడా న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న ష‌ర్మిల‌.. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ ప్ర‌క‌టించారు.

అయితే.. ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌ధాన పార్టీల‌న్నీ అదే రోజు అభిప్రాయం వ్య‌క్తం చేశాయి. టీఆర్ఎస్ మాత్రం అధికారికంగా స్పందించ‌లేదు. తాజాగా.. మంత్రి హ‌రీష్ రావు ఈ కొత్త పార్టీపై స్పందించారు. అంతేకాదు.. షర్మిల విమ‌ర్శ‌ల‌కు కూడా గట్టిగానే స‌మాధానం చెప్పారు.

ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌లో ఎవ‌రికీ న్యాయం జ‌ర‌గ‌లేద‌ని, ప్ర‌జ‌లెవ‌రూ సంతోషంగా లేర‌ని అన్నారు. దీనికి సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో సమాధానం చెప్పారు మంత్రి హరీష్ రావు. అక్కడ రైతు వేదిక‌ను ప్రారంభించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. షర్మిల పేరెత్తకుండానే.. 'ఎవ‌రో వ‌చ్చి తెలంగాణ‌లో రైతుల‌కు ఏం న్యాయం జ‌రిగింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా?' అని ప్రశ్నించారు మంత్రి.

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు అక్కడి ప్రభుత్వం చేస్తున్నదానికంటే.. తాము ఎన్నో రెట్లు ఎక్కువగా లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పారు హరీష్ రావు. "ఏపీలో రైతులకు ఎంత భూమి ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్మతో కలిపి మొత్తం రూ.12,500 మాత్రమే ఇస్తున్నారు. కానీ.. తెలంగాణలో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నాం'' అని గుర్తు చేశారు హరీష్.

హరీష్ మాటలతో టీఆర్ఎస్ కూడా షర్మిల పార్టీని పరిగణనలోకి తీసుకున్నట్టయ్యింది. దీంతో.. తెలంగాణలో సరికొత్త రాజకీయ వేడి మొదలయ్యిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి, ఈ పొలిటికల్ సినారియో ఎంత వరకు వెళ్తుంది? ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది? అన్న‌ది చూడాలి.