Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం లేదా ?

By:  Tupaki Desk   |   10 March 2021 10:30 AM GMT
పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం లేదా ?
X
అసంపూర్తిగా ఉండిపోయిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదా ? స్టేట్ ఎన్నికల కమీషన్ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార ఈనెల 17వ తేదీ నుండి ఎల్టీసీపై వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ మొదలైంది. 14వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అంటే దాదాపు అదేరోజు అన్నీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు వచ్చేస్తాయి.

అందుకనే 17వ తేదీనుండి వారంరోజుల పాటు నిమ్మగడ్డ లీవులో వెళుతున్నారు. తిరిగి కమీషనర్ 24వ తేదీ తర్వాత కానీ ఆఫీసుకు రారు. అయితే ఈనెల 31వ తేదీన నిమ్మగడ్డ రిటైర్ అయిపోతున్నారు. అంటే లీవులో నుండి వచ్చి జాయిన్ అవటానికి రిటైర్మెంట్ తేదీకి మధ్య ఉండే వ్యవధి కేవలం పదిరోజులు మాత్రమే. ఈ పదిరోజుల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణ దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇదే సమయంలో ఈనెల 19వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదు.

ఎందుకంటే పరిషత్ ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసుంది. అప్పట్లో ఆగిపోయిన పరిషత్ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దుచేసి మళ్ళీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన కోర్టులో కేసు వేసింది. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది. అది పూర్తయితే కానీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు లేదు. అయితే జనసేన వేసిన కేసుపై హై కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ఆడిపోయిన ఎన్నికల ప్రక్రియను ఆగిపోయిన దగ్గర నుండే నిమ్మగడ్డ ప్రారంభించే అవకాశం కూడా ఉంది.

అయితే అలా ప్రారంభించాలని కమీషనర్ అనుకున్నా దానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎలా చూసినా 31వ తేదీలోగా పరిషత్ ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదు. కాబట్టి పరిషత్ ఎన్నికల నిర్వహణ అంశాన్ని వదిలిపెట్టేసే యోచనలో నిమ్మగడ్డ ఉన్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అదే జరిగే తర్వాత వచ్చే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ ఆధ్వర్యంలోనే పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. చూద్దాం నిమ్మగడ్డ మనసులో ఏముందో.