Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లిలో చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌కు ముప్పు పొంచి ఉందా?

By:  Tupaki Desk   |   12 Oct 2022 11:17 AM GMT
ఉండ‌వ‌ల్లిలో చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌కు ముప్పు పొంచి ఉందా?
X
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు ముప్పు పొంచి ఉంద‌ని తెలుగుదేశం వ‌ర్గాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లాలో రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని ఉండ‌వ‌ల్లిలో చంద్ర‌బాబుకు నివాసం ఉంది. అయితే ఇక్క‌డ కృష్ణాన‌దీ ప్రాంతంలోని ఇసుక టిప్ప‌ర్లు చంద్ర‌బాబు ఇంటి స‌మీపంలో ఉండ‌గా క‌ర‌కట్ట‌పైకి ప్ర‌యాణిస్తున్నాయి. ఇలా వంద‌లాది లారీలు, టిప్ప‌ర్లు నిత్యం రాత్రింబ‌వ‌ళ్లు తిరుగుతున్నాయ‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఈ ఇసుక త‌వ్వ‌కాలు చంద్ర‌బాబు ఇంటి స‌మీపంలో భారీగా పెరిగిపోయాయ‌ని అంటున్నారు.

ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు సైతం వైసీపీ శ్రేణులు ఆయ‌న‌పై దాడికి ప్ర‌య‌త్నించాయి. గ‌తంలో వైసీపీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్... చంద్ర‌బాబు ఇంటిపైకి దాడికి భారీ కాన్వాయ్‌తో వెళ్లి క‌ల‌క‌లం సృష్టించారు. ఇప్పుడు వంద‌లాది లారీలు, టిప్ప‌ర్లు ప‌ద ఘ‌ట్ట‌న‌ల‌తో ఉండ‌వ‌ల్లి ప్రాంతం మార్మోమోగుతుంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ వ్య‌వ‌హార‌మంతా ఉండ‌వ‌ల్లిలో చంద్ర‌బాబు ఇంటి స‌మీపంలోనే జ‌రుగుతుండ‌టంతో ఆయ‌న‌కు ముప్పు పొంచి ఉంద‌నే అభిప్రాయాలు టీడీపీ వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇటీవ‌ల కుప్పం ఘ‌ట‌న‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌కు భ‌ద్ర‌త‌ను పెంచింది. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లిన‌ప్పుడు ఏపీ పోలీసులు ఆయ‌న భ‌ద్ర‌త‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌ను స‌మీక్షించిన నేష‌న‌ల్ సెక్యూరిటీ గ్రూప్ ఆయ‌నకు డీఐజీ ర్యాంకు స్థాయి అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రౌండ్‌ ది క్లాక్‌ పన్నెండేసి మంది కమాండోలను కేటాయించింది. అయినా.. ఆయన భద్రతకు పూర్తిగా ఇంకా ముప్పు తొలగిపోలేదని ఉండ‌వ‌ల్లి స‌మీపంలో ఇసుక త‌వ్వ‌కాల పరిణామాలు సూచిస్తున్నాయ‌ని అంటున్నారు.

పూడికతో కృష్ణా రిజర్వాయర్‌ నీటి సామర్ధ్యం తగ్గిపోయిందంటూ.. జగన్‌ ప్రభుత్వం గతేడాది ఎగువ కృష్ణలో మొత్తం 12 చోట్ల డ్రెడ్జింగ్‌ ద్వారా పూడికతీత పనులకు అనుమతులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.ఇందులో భాగంగా ఉండవల్లి కరకట్ట వెంబడి చంద్రబాబు నివాసం వెనుకవైపు కూడా డ్రెడ్జింగ్‌ పనులను ప్రారంభించేశార‌ని తెలుస్తోంది.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పూడిక‌తీత ప‌నులు సాగుతున్నాయ‌ని చెబుతున్నారు. చంద్రబాబు నివాసం వెనుకవైపు సుమారు ఐదారొందల మీటర్ల దూరంలో ఉన్న ర్యాంపు వద్ద డ్రెడ్జింగ్‌ చేపడుతున్నారు. అక్కడ ఇసుకను తోడి చంద్రబాబు ఇంటికి అతి సమీపంలో డంపింగ్‌ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక్క‌డ ఇసుక నిల్వలు ఓస్థాయికి చేరాక డ్రెడ్జింగ్‌ పనులకు తాత్కాలిక విరామం ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

డ్రెడ్జింగ్‌ చేసే రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో కూడ పనులు కొనసాగిస్తున్నార‌ని ఉండ‌వ‌ల్లి వాసులు కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. భారీ కోత మిషన్‌ల‌తో కృష్ణా కరకట్ట దెబ్బతింటోందని ఉండవల్లి ప్ర‌జ‌లు కొద్దిరోజుల కిందట ఆందోళన చేసిన‌ట్టు స‌మాచారం.

అయితే డ్రెడ్జింగ్ పేరుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ ప‌నుల‌ను వ్యూహాత్మ‌కంగానే చేస్తుంద‌ని చెబుతున్నారు. ఉండ‌వ‌ల్లిలో ఉంటున్న చంద్ర‌బాబును అక్క‌డి నుంచి ఖాళీ చేయించ‌డానికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం డ్రెడ్జింగ్ పేరుతో ఇసుక త‌వ్వ‌కాలు చేయిస్తోంద‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

గ‌తంలోనే ఇసుక త‌వ్వ‌కాల విష‌యంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ మ‌ధ్య మాట‌ల యుద్ధం కూడా న‌డిచింద‌నే గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్ వ‌ద్ద ఫిర్యాదులు చేసే వ‌ర‌కు ఈ వ్య‌వ‌హారం వెళ్లింద‌ని చెబుతున్నారు. అదే సందర్భంలో కరకట్ట వెంబడి ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూడా ఖాళీ చేయించేందుకు అనేక విధాలుగా వైసీపీ ప్ర‌భుత్వం ప్రయత్నించింద‌ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఇసుక దందాను యథేచ్ఛగా సాగించేందుకు ప్రతిపక్ష నేత చంద్ర‌బాబు నివాసం అధికార పక్ష నేతలకు ఓ అడ్డుగా ఉందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందుకే దానిని ఖాళీ చేయించేందుకు వరదలను సైతం వాడుకుని చంద్ర‌బాబు నివాసాన్ని ముంచేశార‌ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా కరకట్ట రోడ్డును రూ.200 కోట్ల వ్యయంతో విస్తరించడం కూడా ఇసుక దందా కోస‌మే అని ఢంకా బ‌జాయించి చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.