Begin typing your search above and press return to search.

ఈమె వల్ల ఏమన్నా ఉపయోగముంటుందా?

By:  Tupaki Desk   |   30 May 2022 4:30 PM GMT
ఈమె వల్ల ఏమన్నా ఉపయోగముంటుందా?
X
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కర్ణాటక నుండే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో నిర్మల కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు కూడా ఆమె కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకనే ఈ రాష్ట్రం నుండే రెండోసారి రెన్యువల్ చేయాలని మోడీ డిసైడ్ అయ్యారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఏపీ కోటాలో ఆమె మొదటిసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

తన సహచర మంత్రి సురేష్ ప్రభుతో కలిసి నిర్మల అప్పట్లో టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ఆమె ఏ రాష్ట్రం నుండి నామినేట్ అయినా ఆ రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు.

ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించినపుడు ఏపీకీ ఆమె వల్ల జరిగిన ఉపయోగం ఏమీ లేదు. పైగా పోలవరం లాంటి పథకాలకు నిధులు కావాలని ఎంత మొత్తుకున్నా ఆమె పట్టించుకోలేదు. శాఖల మంత్రులుగా ఉన్నది ఎవరైనా మోడి తలచుకుంటే మాత్రమే నిధులందుతాయి.

ఏపీ నుంచి కాలపరిమితి అయిపోగానే తర్వాత కర్నాటక నుండి నామినేట్ అయ్యారు. అయితే కర్నాటకకు కూడా జరిగిన లాభం ఏమీలేదనే చెప్పాలి. బెంగుళూరులో నిర్మిస్తున్న మెట్రో, ప్రాజెక్టు, ఫ్లై ఓవర్లకు నిధులు కావాలని అక్కడి ప్రభుత్వం ఎంతగా అడిగినా పెద్దగా మంజూరు కాలేదు. ఇలా అనేక పథకాలు, నిర్మాణాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఎందుకనో రాలేదు. ఇదే సమయంలో తమిళనాడులో ఫ్లైఓవర్లు, మెట్రో ప్రాజెక్టులకు మాత్రం వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించారు.

అంటే తన సొంత రాష్ట్రానికి మాత్రం నిధుల విడుదల విషయంలో చాలా ఔదార్యాన్ని చూపించిన నిర్మల తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలను మాత్రం పట్టించుకోలేదు.

అంటే తమిళనాడు విషయంలో మాత్రం మోడితో మాట్లాడి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయించినట్లు అర్ధమైపోతోంది. కాబట్టి నిర్మలను రాజ్యసభకు ఏ రాష్ట్రం నుండి నామినేట్ చేసినా వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు.