Begin typing your search above and press return to search.

డిపాజిట్లు తెచ్చుకోవడంలో పోటీయే ?

By:  Tupaki Desk   |   8 Oct 2021 4:46 AM GMT
డిపాజిట్లు తెచ్చుకోవడంలో పోటీయే ?
X
ఫలితం నిర్ణయమైపోయిన ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు కేవలం డిపాజిట్ల కోసమే పోటీచేస్తున్నాయి. కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ఈనెల 30వ తేదీన జరగబోతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధ గెలుపు ఇప్పటికే నిర్ణయమైపోయింది. కాకపోతే మెజారిటి ఎంత వస్తుంది అన్నదే తేలాలి.

ఇలాంటి ఉపఎన్నికలో వైసీపీని ఢీ కొనేందుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోయింది. అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ను చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అయితే ఇక్కడ పోటీచేయాలని అనుకున్న జనసేన చివరి నిముషంలో వెనక్కు తగ్గింది. పోటీ చేసినా గెలిచే అవకాశం లేక చివరకు డిపాజిట్ అయినా వస్తుందో రాదో అనే అనుమానాలు పెరిగిపోయాయి. అందుకనే జనసేన అధినేత పవన్ కల్యాన్ తెలివిగా వ్యవహరించారు. దివంగత ఎంఎల్ఏ భార్య పోటీ చేస్తున్నారు కాబట్టి సంప్రదాయం ప్రకారం తాము పోటీ నుండి విరమించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో గెలుపోటముల సమస్య నుంచి జనసేన బయటపడిపోయింది.

ఇంతలో ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా బాగా ఆలోచించినట్లుంది. దాంతో వెంటనే అదే సంప్రదాయాన్ని కారణంగా చూపించి తాము కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే తమ అభ్యర్థిగా సురేష్ ను బీజేపీ, కమలమ్మను కాంగ్రెస్ అభ్యర్ధులుగా ప్రకటించాయి. సరే వీళ్ళు ఎంతమేరకు పోటీ ఇస్తారు అన్నది పక్కన పెట్టేస్తే పోటీ అయితే తప్పదని తేలిపోయింది. దాంతో అసలు పై రెండు పార్టీలకు అసలు డిపాజిట్లు దక్కుతాయా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

కడప జిల్లా అంటే వైఎస్ సొంత జిల్లా అనే పేరు. వైఎస్సార్ హయాంలో అయినా ప్రత్యర్ధి పార్టీలకు కొన్ని సీట్లు దక్కేవి. జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యర్ధులకు ఆ అవకాశం కూడా దక్కటం లేదు. 2014 ఎన్నికల్లో జిల్లాలోని 10 సీట్లలో ఒకే ఒక్కటి టీడీపీకి దక్కింది. 2019 ఎన్నికల్లో అయితే పదికి పదిసీట్లూ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా దాదాపు ఇలాంటి రిజల్టే రిపీటైంది. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీని ఢీ కొనటమంటే మామూలు విషయంకాదు.

అందుకనే జనసేన, టీడీపీ గౌరవప్రదంగా తప్పుకున్నాయి. మరిలాంటి ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పోటీచేసి సాధించేదేమీలేదు. కాకపోతే ఈ రెండు పార్టీలకు ఎన్ని ఓట్లొస్తాయనే విషయమే ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 735 మాత్రమే. కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వీటికన్నా నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు ఎక్కువ ఓట్లొచ్చాయి. అందుకనే పై రెండుపార్టీలకు ఇపుడు కూడా డిపాజిట్లు రావనే టాక్ బాగా జరుగుతోంది. మరి తమ శక్తి ఏపాటిదో బీజేపీ, కాంగ్రెస్ లు నిరూపించుకనే సమయం వచ్చింది చూద్దాం ఏం చేస్తాయో.