Begin typing your search above and press return to search.

ఢిల్లీ నుంచి కేసీఆర్ మీద అంత ఒత్తిడి తెచ్చారా?

By:  Tupaki Desk   |   4 Oct 2020 6:15 AM GMT
ఢిల్లీ నుంచి కేసీఆర్ మీద అంత ఒత్తిడి తెచ్చారా?
X
ఏదైనా టార్గెట్ చేస్తే.. అనుక్షణం దాని గురించి ఆలోచించటమే కాదు.. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్త్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువే. కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడుతున్న ఆయన గడిచిన మూడు రోజులుగా రోజుకో తీరులో ఫైర్ అవుతున్నారు. ఈ నెల ఆరో తేదీన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ తీరును కంటిన్యూ చేశారు.

ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి వెల్లడించిన ఒక కొత్త విషయాన్ని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వ్యవసాయ.. విద్యుత్తు సంస్కరణల బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ.. ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడిని తీసుకొచ్చారన్నారు. తెలిసిన చాలామంది ప్రముఖుల చేత కూడా చెప్పించినట్లుగా చెప్పి సంచలనంగా మారారు. అంత ఒత్తిడిలోనూ తాను మాత్రం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని చూస్తే.. కేంద్రంలో మోడీ సర్కారుపై పోరుకు ఆయన సిద్ధమవుతున్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. అదే సమయంలో.. మోడీషాలు లోగుట్టుగా తీసుకొచ్చిన ఒత్తిడిని సైతం బయటకు చెప్పేయటం ద్వారా మోడీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. అదే సమయంలో తాను వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. కీలకమైన బిల్లుల విషయంలో తమకు మద్దతు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తీసుకురావటం.. తెలిసిన వారి చేత చెప్పించటం చాలా కామన్ గా జరిగేవే.

కానీ.. వాటిని పెద్దగా ప్రస్తావించరు. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం ఓపెన్ కావటం మోడీషాలకు కాస్త ఇబ్బంది కలిగించే అంశం. అయితే.. ఈ విషయాన్ని వెల్లడించటం ద్వారా కేసీఆర్ తనకు తాను.. రైతుల విషయంలో ఎంత కటువుగా ఉంటానన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. అంతేకాదు.. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని నిర్వీర్యం చేయటానికి బీజేపీ ప్రయత్నిస్తుందంటూ కీలక ఆరోపణ చేశారు. ఇతర పార్టీల ప్రభుత్వాల్ని కూలదోసి.. తమ పార్టీ అధికారంలోకి రావటానికి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవన్నారు.

కర్ణాటక.. గోవా.. మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం ఫలించిందని..రాజస్థాన్ లో వారి ప్రయత్నాలు చెల్లలేదన్నారు. మహారాష్ట్రాలోనూ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టిన కేసీఆర్ వారికి లొంగుతాడా? అంటూ తన గొప్పతనాన్ని.. తన తెలివి హైలెట్ అయ్యేలా వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు చెప్పే మాటల్లో 99 శాతం అబద్ధాలేనని చెబుతున్న కేసీఆర్ మాటలు చూస్తే.. మోడీ సర్కారుపై పోరుకు సిద్ధమన్న సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. మరి.. మోడీషాల స్పందన ఏమిటో తేలాల్సిన అవసరముంది.