Begin typing your search above and press return to search.

ఐపీఎల్ నార తీసే సత్తా తెలుగోళ్లకు ఉందా?

By:  Tupaki Desk   |   10 March 2021 2:30 AM GMT
ఐపీఎల్ నార తీసే సత్తా తెలుగోళ్లకు ఉందా?
X
ప్రతి విషయంలోనూ వివక్షే. తెలుగు రాష్ట్రాలు ఏం తప్పు చేశాయ్? ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వరు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ దానికి ఇవ్వాల్సిన నిధుల్ని కేంద్రం ఇవ్వదు. అది సర్లే అనుకుంటే.. విశాఖ ఉక్కును అమ్మేస్తుంది. ఇలా ఏపీకి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. తెలంగాణ విషయానికి వస్తే.. ఇలాంటివెన్నో. ఇప్పటికే తెలంగాణ అధికారపక్షం కేంద్రంపై విరుచుకుపడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. రాజకీయాలతో సంబంధం లేని ఆట విషయంలోనూ తెలుగు రాష్ట్రాలపై వివక్ష చూపించాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న.

దేశంలోని మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు తక్కువగా నమోదు కావటమే కాదు.. అంతర్జాతీయ వసతులు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివేళ..ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ.. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ చూస్తే.. ఒళ్లు మండక మానదు. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నోరు తెరిచి మరీ.. ఐపీఎల్ మ్యాచుల్ని హైదరాబాద్ లో నిర్వహించాలని.. ఒకవేళ మ్యాచ్ నిర్వహణకు అవకాశం వస్తే.. ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పిస్తుందని చెప్పిన తర్వాత కూడా ఒక్క మ్యాచ్ కు కూడా నిర్వహించేందుకు వీల్లేని రీతిలో షెడ్యూల్ సెట్ చేయటం తెలిసిందే.

ఐపీఎల్ మ్యాచులన్ని అయితే ముంబయి లేదంటే గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించటం చూసినప్పుడు.. క్రికెట్ మ్యాచ్ నిర్వహణలోనూ ఇంత వివక్ష అవసరమా? అన్న భావన కలుగక మానదు. రోజుకు తొమ్మిది వేల కేసులు నమోదవుతున్న ముంబయిలో మ్యాచుల్ని నిర్వహిస్తున్నప్పుడు మొహాలీకి ఏమైందంటూ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజమే..ఆయన వాదనలోనూ నిజం ఉంది.

కోవిడ్ అధికంగా ఉన్న నగరాల్లో ఐపీఎల్ మ్యచుల్ని నిర్వహిస్తున్నప్పుడు.. అంత తీవ్రత లేని నగరాల్లో నిర్వహించటానికి ఉన్న ఇబ్బంది ఏమిటన్న విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు వెల్లడించింది లేదు.

ఇదంతా చూస్తున్నప్పుడు అదే పనిగా తెలుగు రాష్ట్రాల్ని అవమానించే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ఐపీఎల్ కు ఎంపిక చేయని నేపథ్యంలో.. ఐపీఎల్ ను తెలుగు వారు చూడాల్సిన అవసరం ఏముంది? అంతా ఒక్కమాట మీద ఉండి.. ఐపీఎల్ ను బాయ్ కాట్ చేస్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరెన్ని చెప్పినా.. ఐపీఎల్ అన్నది పూర్తి వాణిజ్యపరమైన సిరీస్. దీనికి సంబంధించిన వార్తల్ని మీడియా చూపించకూడదని.. అదే సమయంలో.. ఈ మ్యాచ్ టెలికాస్ట్ ను కోట్లాది మంది బాయ్ కాట్ చేస్తే దెబ్బకు సెట్ కాదు. తెలుగోళ్ల తెగువకు.. మనలానే వివక్ష ఎదుర్కొనే మిగిలిన రాష్ట్రాల ప్రజలు కలిస్తే.. ఐపీఎల్ నార తీయటం ఖాయం. మరి.. ఆ తెగువను తెలుగోళ్లు చూపిస్తారంటారా?