Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉండదా?

By:  Tupaki Desk   |   4 July 2021 6:30 AM GMT
హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉండదా?
X
హైదరాబాద్ మహానగరం అన్నంతనే భారీ ఎత్తున నిర్మించే భవనాలు కనిపిస్తాయి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల ప్రాజెక్టులు విరివిరిగా వచ్చేవి. గతంలో ఐదారు అంతస్తులకు పరిమితమయ్యే ప్రాజెక్టులకు భిన్నంగా ఇప్పుడు భారీ ఎత్తున పదిహేను నుంచి పాతిక అంతస్తుల వరకు నిర్మించేందుకు బిల్డర్లు ఆసక్తి చూపుతున్నారు. భూమి విలువ విపరీతంగా పెరిగిపోవటం.. అందుకు తోడునిర్మాణ వ్యయం పెరిగిపోతున్న వేళలో.. పరిమిత సంఖ్యలో కాకుండా బహుళ అంతస్తుల్లో నిర్మాణాల్ని నిర్మించటం.. వాటిని గేటెడ్ కమ్యునిటీలను చేయటం ఎక్కువైంది. ఇలాంటి భవనాలకు ఈ మధ్యన ఆదరణ పెరుగుతోంది.

గతంలో స్టాండిలోనా తరహా భవన నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు. అందుకు భిన్నంగా గడిచిన రెండేళ్లుగా హైదరాబాద్ రియల్ మార్కెట్లో కొత్త ట్రెండ్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. స్టాండిలోనా (ఐదారు అంతస్తులతో ఒకే భవనం) అపార్ట్ మెంట్లపై ఆసక్తి తగ్గుతోంది. ఇలాంటి వాటిల్లో పిల్లలు ఆడుకోవటానికి తగిన ప్లేస్ లేకపోవటంతో పాటు.. పలు ఇతర సమస్యలు వస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు సెక్యురిటీ సమస్య అంతకంతకూ తీవ్రమవుతోందని చెప్పే వారు ఎక్కువయ్యారు.

దీంతో.. పెద్ద ఎత్తున స్థలాన్ని సేకరించి.. అందులో టవర్ల నిర్మాణం చేయటం.. ఒక్కో టవరు కనిష్ఠంగా 15 నుంచి పాతిక అంతస్తులు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్కింగ్ కోసం భారీ ఎత్తున భూగర్భంలో నాలుగైదు ఫ్లోర్లు వేస్తున్న వారు లేకపోలేదు. అయితే. . ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో ఎకరా.. అంతకు మించిన విస్తీర్ణంలో నిర్మించే బహుళ అంతస్తుల సముదాయాల్లో సెల్లార్ పార్కింగ్ కు నో చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు భూగర్భంలో మూడు.. నాలుగు సెల్లార్లు నిర్మించేందుకు బదులుగా.. మొదటి మూడు నాలుగు అంతస్తుల్ని పార్కింగ్ కోసం వినియోగించుకోవాల్సిందిగా ఆదేశాలుజారీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ తరహా పార్కింగ్ ను పోడియం పార్కింగ్ గా పేర్కొంటున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ తరహా పార్కింగ్ ను అమలు చేస్తున్నారు. ఒకవేళ నాలుగైదు అంతస్తులు పార్కింగ్ కు సరిపోదంటే.. మరో రెండు అంతస్తుల్ని సైతం పార్కింగ్ కోసం ఇవ్వాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఎందుకిలా? ఇప్పటివరకు అమలు చేస్తున్న సెల్లార్ పార్కింగ్ కు ఎందుకు చెక్ చెబుతున్నట్లు? అన్న ప్రశ్నలకు సమాధానంగా భారీ వర్షాలుగా చెబుతున్నారు. పెద్ద ఎత్తున వర్షాలు పడినప్పుడు.. నీటి ప్రవాహం పెరిగి.. వీధుల్లో నుంచి సెల్లార్ పార్కింగ్ లోకి పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతున్నాయి. భవనానికి సైతం ఇబ్బందులు తప్పని పరిస్థితి.

గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా అపార్ట్ మెంట్లలోని పార్కింగ్ లోకి నీళ్లు చేరి.. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పార్కింగ్ లో నిలిచిన నీటిని బయటకు పంప్ చేయటానికి నాలుగైదు రోజులు పట్టటమే కాదు.. లిప్టుల్లోకి నీరు వెళ్లటం ద్వారా అవి పని చేయలేదు. దీంతో.. తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఇబ్బందుకు చెక్ పెట్టేందుకు వీలుగా భూగర్భ పార్కింగ్ కు నో చెప్పేసి.. పోడియం పార్కింగ్ విధానాన్ని తెర మీదకు తీసుకురావాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తాజాగా 2012లో రూపొందించిన భవన నిర్మాణ నిబంధనల్ని సమరిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.

దీని ప్రకారం ఎకరం అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే బహుళ అంతస్తుల సముదాయాల్లో భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతుంటాయి. ఇలాంటి చోట్ల ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తారు. ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ లో ఇలాంటి ప్రాజెక్టులు తక్కువలో తక్కువ 200 - 300 వరకు ఉంటాయంటున్నారు. వీటిల్లో దాదాపు 30 నుంచి 40 వేల ప్లాట్లు నిర్మాణం కానున్నాయి. మరి.. ఈ తాజా నిబంధనలపై భవన నిర్మాణదారులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారో చూడాలి.