Begin typing your search above and press return to search.

లోకేష్ కు ఇదేనా పెద్ద సమస్య ?

By:  Tupaki Desk   |   23 Oct 2021 11:30 AM GMT
లోకేష్ కు ఇదేనా పెద్ద సమస్య ?
X
నారావారి వారసుడు లోకేష్ విచిత్రమైన సవాలు చేశారు. పార్టీ ఆఫీసులపై వైసీపీ నేతలు చేసిన దాడులపై లోకేష్ స్పందన విచిత్రంగా ఉంది. ఇంతకాలం ముఖ్యమంత్రి గారు అని సంబోధించారట. తాజా దాడుల తర్వాత సైకో రెడ్డి, శాడిస్ట్ రెడ్డి అని సంబోధిస్తున్నానంటు చెప్పడం విచిత్రం. జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని సైకో రెడ్డి, శాడిస్ట్ అని గతంలో కూడా లోకేష్ చాలాసార్లే నోరు పారేసుకున్నారు. లోకేష్ ట్విట్టర్ వేదికగా గతంలో చేసిన ఆరోపణలు, విమర్శలను ఒకసారి చెక్ చేస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలనైనా, విమర్శలైనా చెప్పవచ్చు. ప్రతిపక్షమన్నాక ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎండగట్టాల్సిందే తప్పేలేదు. కానీ సీఎంను పట్టుకుని వ్యక్తిగతంగా నోటికొచ్చినట్లు తిట్టడాన్ని ఎవరు హర్షించరు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జగన్ను లోకేష్ సవాలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ‘ఎన్నాళ్ళిలా ఇంట్లో దాక్కుని కుక్కులతో దాడులు చేయిస్తావు ? నువ్వే రా తేల్చుకుందాం’ అంటు చాలెంజ్ చేశారు.

జగన్ను బయటకు రమ్మనడం ఏమిటి ? తేల్చుకుందామని సవాలు విసరడం ఏమిటి ? అర్థం కాకుండా ఉంది లోకేష్ వ్యవహారం. అసలు జగన్ తో లోకేష్ ఏమి తేల్చుకుందామని అనుకుంటున్నారు ? వీళ్ళిద్దరి మధ్య తేల్చుకోవాల్సిన వ్యవహారాలు ఏమున్నాయి ? అన్నదే అర్థం కావట్లేదు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కొడుకుగా మంత్రిగా హోదాలో మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయారు.

ఇపుడున్న ఎంఎల్సీ పదవి కూడా తొందరలోనే ముగిసిపోతుంది. 2024 ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి ఏదో ఒక సేఫ్ నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లోకేష్ మీదుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా కుప్పంలో చాలా కష్టపడాలి. మరి లోకేష్ పరిస్థితి ఏంటి?

మంగళగిరి నుండే పోటీ చేస్తానని లోకేష్ చెబుతున్నది వాస్తవం కాదని పార్టీ వర్గాలే అనుమానిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లోనే జగన్ ఏమిటి, చంద్రబాబు+లోకేష్ కెపాసిటి ఏమిటనే విషయంపై జనాలే తీర్పిచ్చారు. మళ్ళీ తన కెపాసిటీని లోకేష్ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదు. అవసరం ఏదన్నా ఉంటే తన కెపాసిటి ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం లోకేష్ కే ఉంది. కాబట్టి ట్విట్టర్లో లేకపోతే మీడియా సమావేశాల్లో జగన్ను సవాలు చేయడం మానేసి తనకొక నియోజకవర్గాన్ని వెతుక్కుంటే బాగుంటుంది.