Begin typing your search above and press return to search.

ప్రజల వద్ద పిండుకునే బడ్జెట్ ఇదీ?

By:  Tupaki Desk   |   1 Feb 2021 11:30 AM GMT
ప్రజల వద్ద పిండుకునే బడ్జెట్ ఇదీ?
X
గ్రామాల్లోని 'శావుకారుల' చందంగా సామాన్యుల నుంచి డబ్బులు పిండుకోవడమే ధ్యేయం అన్నట్టుగా కేంద్ర బడ్జెట్ సాగిందని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది సామాన్యుడి డబ్బులు గుంజే బడ్జెట్ అంటూ మండిపడుతున్నారు. పన్నుల ద్వారా ఆదాయం పిండుకోవడం.. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మరింత ఆదాయం పొందడమే ధ్యేయంగా ఈ బడ్జెట్ రూపొందించారని విమర్శలు వస్తున్నాయి. ఆదాయాన్ని సామాన్యుల నుంచి లాగేయడమే అభివృద్ధిగా బడ్జెట్ లో చూపించారు. ఒక్క తమిళనాడు, బెంగాల్, అసోం రాష్ట్రాలకు తప్పితే ఏ రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్ కనిపించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలున్న రాష్ట్రాలపైనే కాస్త కరుణ చూపించారు.

మధ్యతరగతి మీద ఊచించని భారం మోపిన నిర్మలమ్మ.. ప్రత్యక్ష పన్నులో ఎలాంటి జాలి చూపకపోవడంపై పన్ను చెల్లింపు దారులు మండిపడుతున్నారు. మధ్యతరగతి ప్రజల ఖర్చులు పెరిగినా.. వారి రోజువారీ ఖర్చుల్లో పన్నులు పెంచేసినా ఆదాయపు పన్ను పరిమితిని పెంచకుండా కేంద్రం దారుణంగా వ్యవహరించిందని ఆడిపోసుకుంటున్నారు. ఆదాయపు పన్నులో మినహాయింపులు ఇవ్వకపోడం సామాన్య ఉద్యోగులను దోపిడీ చేయడానికే అని బడ్జెట్ పై ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

వ్యవసాయ సెస్ పేరుతో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు.. పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4 అగ్రిసెస్‌ విధించడాన్ని ప్రజలు అస్సలు జీర్ణించుకోవడం లేదు. పలు రాష్ట్రాల్లో లీటర్‌ రూ.వందకు చేరిన పెట్రోల్‌ రేటు చూసి ప్రజల కడుపు రగిలిపోతోంది. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా తక్కువగా ఉన్న పన్నుల పేరుతో దోపిడీ ప్లాన్ వేసిన నిర్మలమ్మ బడ్జెట్ పై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

ఇక ఎల్ఐసీ సహా లాభాలు తెచ్చిపడుతున్న ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముకోవడానికి కేంద్రం రెడీ కావడంపై ఆయా సంస్థల్లోని కార్మికులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. లాభదాయకమైన ఎల్ఐసీని ఈ ఏడాదే లిస్టింగ్ కు తీసుకురాబోతున్నారు. నవరత్న కంపెనీల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణకు ప్రణాళికలు ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్పొరేట్లకు దోచుపెట్టడమే అని ఆయా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఎన్నికలున్న రాష్ట్రాలు, బీజేపీ రాష్ట్రాలకు నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాలకు చిప్ప చేతికి ఇచ్చిన కేంద్రబడ్జెట్ ను విపత్కర బడ్జెట్ గా మేధావులు, నిపుణులు అభివర్ణిస్తున్నారు. జనవరిలో లక్షకోట్ల జీఎస్టీ పన్నులు వసూళ్లు కావడం.. దేశ ప్రజలు ఎంతైనా కడుతారని.. మరింతగా దోపిడీకి స్కెచ్ గీసిన కేంద్రప్రభుత్వం తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల వద్ద పిండుకునే బడ్జెట్ గా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు