Begin typing your search above and press return to search.

మోడీతో ఢీకొట్టడానికి కేసీఆర్ కు ఇదో మంచి బూస్ట్ అన్నట్టే?

By:  Tupaki Desk   |   23 Sep 2022 5:23 AM GMT
మోడీతో ఢీకొట్టడానికి కేసీఆర్ కు ఇదో మంచి బూస్ట్ అన్నట్టే?
X
బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. హిందీ వాళ్ల కంటెంట్ ఆ హిందీ జనాలకే ఎక్కడం లేదు. అమీర్ ఖాన్ నుంచి మొదలుపెడితే అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, వరకూ అందరి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అదే సమయంలో మన దక్షిణాది సినిమాలు హిందీ మార్కెట్ ను ఏలుతున్నాయి. మన సినిమాలు, నేటివిటీ, భాష, యాసకు హిందీ జనాలు ఆకర్షితులవుతున్నారు. మరి సినిమాలు ఆడినట్టు మన రాజకీయాలు కూడా హిందీలో నడుస్తాయా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ చర్చను లేవనెత్తింది ఎవరో కాదు.. తెలంగాణ మంత్రి కేటీఆర్.

ఓ జాతీయ దినపత్రిక కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కు ఒక సూటి ప్రశ్న ఎదురైంది. 'కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేయగలడా?' అని.. దానికి కేటీఆర్ ఇచ్చిన సమాధానం వైరల్ అయ్యింది. ఆయన చెప్పి ఉదాహరణ అందరినీ ఆకట్టుకుంది. హిందీ వాళ్లు తీసిన సినిమాలు హిందీ జనాలకు నచ్చడం లేదు. అదే మన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పలు వారికి నచ్చాయి. ఆదరించారు. ఇప్పుడు మోడీకి పోటీగా కేసీఆర్ వస్తే కూడా ఇదే జరుగుతుంది. ప్యాన్ ఇండియాలో కేసీఆర్ హిట్ అవుతాడు' అని కేటీఆర్ చాలా లాజిక్ గా సమాధానం చెప్పాడు.

కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. రెండు సార్లు గెలిచిన మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా మోడీ హయాంలో కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని.. అదానీ లాంటి వారు ప్రపంచంలోనే నంబర్ 2 ధనవంతుడిగా ఎదగడం వెనుక మోడీ సర్కార్ హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్యులను ధరాఘాతంతో కొడుతూ.. కార్పొరేట్లకు ఫేవర్ గా మోడీ పాలన ఉందన్న అపవాదు ఉంది. ప్రతిపక్షం కాంగ్రెస్ బలంగా లేకపోవడంతో బీజేపీ ఆటలు సాగుతున్నాయంటున్నారు. బలంగా నిలబడే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా దేశమంతా ప్రజల తీరు మారుతుందని అంటున్నారు.

మోడీకి పోటీగా ఎదగాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రత్యామ్మాయంగా థర్డ్ ఫ్రంట్ తేవాలని యోచిస్తున్నారు. కేసీఆర్ కు సపోర్టుగా కేజ్రీవాల్, నితీష్, మమత, స్టాలిన్, థాక్రే, కుమారస్వామిలాంటి వారు కూడా నిలబడితే అది సాధ్యమే.

మోడీ బలంగా ఉన్నంత వరకూ వీరు ఎవరూ రారు. ఒకసారి ఎన్నికల్లో మెజార్టీ తగ్గితే ఈ పిల్లులు అన్నీ పులులు అవుతాయి.బీజేపీపై పడుతాయి. ఆ చాన్స్ కోసమే చూస్తున్న కేసీఆర్ ఎన్నికల వరకూ ఏదో ఒక మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు.

తెలుగు వారి కంటెంట్ ఇష్టపడ్డ హిందీ జనాలకు.. ఇక్కడి నేత కూడా ఖచ్చితంగా నచ్చుతాడని.. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ నినాదం ఖచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ 'రైతులకు ఉచిత విద్యుత్' అనే అతిపెద్ద నినాదాన్ని ఎత్తుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతులందరికీ ఇచ్చానని.. జాతీయ స్థాయిలో దేశమంతా ఇస్తానన్న నినాదాన్ని ఇవ్వబోతున్నట్టు తెలసింది. మన సినిమాలు లాగానే కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో హిట్ అవుతాడని.. మోడీతో ఢీకొట్టడానికి కేసీఆర్ కు ఇదో బూస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.