Begin typing your search above and press return to search.

మోడీ సాబ్ ఇదేం బాగోలేదు.. రెండో రోజుకు సా..గదీయటమా?

By:  Tupaki Desk   |   20 Jan 2023 5:02 AM GMT
మోడీ సాబ్ ఇదేం బాగోలేదు.. రెండో రోజుకు సా..గదీయటమా?
X
వాళ్లు అలాంటి ఇలాంటి అమ్మాయిలు కాదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు ప్రతిష్ఠల్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన వారు. అలాంటి వారు ఒకరో ఇద్దరో కాకుండా ఏకంగా పదుల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి.. తమ సమాఖ్య చీఫ్ లైంగిక వేధింపులకు దిగుతున్నారన్న మాట చెప్పిన తర్వాత.. వాడెంత తోపు అయినప్పటికీ వెంటనే చర్యలకు ఉపక్రమించాలి. కాదంటే.. ముందు పక్కన పెట్టేసి.. తీరుబడిగా చర్యలు తీసుకున్నా అదో పద్దతి. అందుకు భిన్నంగా రెండో రోజు కూడా వారి నిరసనలు.. ఆందోళనలు సాగటం.. అది కూడా మోడీ రాజ్యంలో.. మోడీ కార్యక్షేత్రమైన దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చోటు చేసుకోవటానికి మించిన దరిద్రం ఇంకేం ఉంటుంది?

ఇంతకూ మేం చెబుతున్నదేమిటో మీకు అర్థమై ఉంటుంది. తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా గళం విప్పిన స్టార్ రెజ్లర్లు రెండో రోజున కూడా తమ డిమాండ్లను వినిపిస్తూ రోడ్ల మీద ఆందోళన చేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మోడీ లాంటి నేత దేశ ప్రధానిగా ఉన్న వేళ.. స్టార్ మహిళా క్రీడాకారిణులు రోడ్ల మీదకు వచ్చి.. తాము ఒక ముఖ్య వ్యక్తి చేత లైంగిక వేధింపులకు గురి అవుతున్నట్లుగా గళం విప్పటం.. ఆ ఆరోపణలు చేసిన వారు ప్రపంచ చాంఫియన్లు కావటం అంటే మాటలా?

అలాంటి ఆరోపణల్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? గంటల వ్యవధిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై వేటు వేసి ఉండాలి కదా? అలా ఎందుకు జరగలేదు? దేశంలోని మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా నిమిషాల వ్యవధిలో స్పందించే ప్రధాని మోడీ.. ఇంతటి విషయం మీద మౌనంగా ఎందుకు ఉన్నట్లు? లోపాయికారీతనంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మహిళా క్రీడాకారులు మాత్రం తమ ఆందోళనను విడిచిపెట్టేందుకు.. నిరసనన విరమించేందుకు ససేమిరా అనటం చూస్తే.. పరిస్థితి తీవ్రత ఎంతన్నది అర్థమవుతుంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషన్ బీజేపీకి కావాల్సిన వ్యక్తి. కాదనలేం. అలా అని.. ప్రభుత్వానికి.. దేశానికి నష్టం కలిగే వేళ.. ఎంతటి మొనగాడినైనా పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంది కదా? అలా కాని పక్షంలో జరిగే నష్టం అంతా ఇంతా కాదు కదా? ఇక.. బ్రిజ్ భూషణ్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే యూపీకి చెందిన ఈ బీజేపీ నేత రెజ్లింగ్ సమాఖ్య మీద ఎంత పట్టు ఉందన్నది తెలిసిందే.

గోండాకు చెందిన ఆయన ఐదుసార్లు గెలిచి.. ఒకసారి సమాజ్ వాదీ తరఫున ఎంపీగా గెలిచారు. అయోధ్యలో వివాదాస్పద కట్టడం విధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను 2020లో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయ్యగారి తీరు ఎంతలా ఉంటుందనటానికి నిదర్శనంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. "నా సన్నిహితుడు రవీంద్రను హత్య చేసినోడిని నేను కాల్చి చంపా. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక హత్య ఇది" అంటూ ఎంపీగా ఉన్న ఆయన ఈ మాట ఇంటర్వ్యూలో బాజాప్తా చెప్పగలిగారంటే.. ఆయన ఎలాంటివాడో అర్థమవుతుంది. ఇలాంటి ఘనుల విషయంలో మోడీ ఎందుకు రియాక్టు కారు?

అసలేం జరగనట్లుగా ఎందుకు మౌనంగా ఉంటారు? అన్నది చూసినప్పుడు.. మోడీ గురించి గొప్పలు చెప్పేవారు.. ఆయన సాహసాల గురించి కథలు కథలుగా చెప్పేవారి మీద తాజా ఉదంతాలు కొత్త సందేహాలు లేవనెత్తేలా చేస్తాయనటంలో సందేహం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.