Begin typing your search above and press return to search.

బాస్‌లందు ఈ బాస్‌ తీరే వేరయా?

By:  Tupaki Desk   |   18 Oct 2022 7:37 AM GMT
బాస్‌లందు ఈ బాస్‌ తీరే వేరయా?
X
సాధారణంగా ఆయా కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగులతో గొడ్డి చాకిరీ చేయించుకునేవారే ఎక్కువ. పనివేళలకు మించిన పనిని చేయించుకుంటూ వేధించేవారే ఎక్కువ. కష్టానికి తగ్గ గుర్తింపు, జీతాలు కూడా ఇవ్వకుండా వేధించుకు తినే బాస్‌ల సంఖ్య తక్కువేమీ కాదు.

అయితే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని అన్నట్టు తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఒక బాస్‌ తీరే వేరు. కేవలం టార్గెట్లు, టాస్కులు అంటూ ఇబ్బంది పెట్టే బాసులు ఉన్న ఈ రోజుల్లో తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు, బైకులు ఇచ్చి ఆయన సర్‌ఫ్రైజ్‌ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాజధాని చెన్నైలో జయంతి లాల్‌ చాయంతి.. చల్లానీ జ్యుయెలరీ పేరుతో ఒక నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దీపావళి కానుకగా తన సిబ్బందికి కార్లు, బైకులు ఇచ్చి పెద్ద గిఫ్ట్ లే ప్రకటించారు. సిబ్బందికి కార్లు, బైకులు ఇవ్వడానికి ఆయనకు ఏకంగా 1.20 కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. అయితే ఏ మాత్రం వెనుకాడకుండా తన సిబ్బందిలో దీపావళి పండుగ కాంతులను ముందే నింపారు.

ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు, వివిధ కంపెనీల ఉద్యోగులు జయంతిలాల్‌ చాయంతిని ప్రశంసిస్తున్నారు. తమకు ఇలాంటి యజమాని ఉండి ఉంటే తమకు కూడా కార్లు, బైకులు గిఫ్ట్ లుగా దక్కేవని నిట్టూరుస్తున్నారు.

కాగా నగల షాపు యజమాని జయంతిలాల్‌ చాయంతి ఉద్యోగులను కుటుంబాలతో సహా భోజనాలకు ఆహ్వానించడంతో ఇది ఏటా షరా మామూలుగా నిర్వహించే కార్యక్రమమే అనుకున్నారు. అయితే ఆయన తన ఉద్యోగులను ఊహించని విధంగా సర్‌ప్రైజ్‌ చేశారు.

చల్లానీ జ్యువెల్లరీలో పని చేసే ఉద్యోగులకు వాళ్ల వాళ్ల ప్రతిభ, హోదాలను బట్టి కొంత మందికి బైకులు, మరికొందరికి కార్లు బహుమతులుగా దక్కాయి. మొత్తం సిబ్బందికి పది కార్లు, ఇరవై బైకులను జ్యువెలరీ అధినేత జయంతి లాల్‌ ఛాయంతి పంచడం విశేషం. ఉద్యోగుల్లో కొందరు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో జయంతిలాల్‌ చాయంతి మాట్లాడుతూ... వీళ్లు ఉద్యోగులు కారు.. నా కుటుంబ సభ్యులు. నా విజయంలో.. వైఫల్యంలో.. ప్రతీ అడుగులో వీళ్లు నా వెన్నంటే ఉన్నారు. లాభాల బాట పట్టడానికి వీళ్లు చేసిన కృషిని వెలకట్టలేను. అందుకే వాళ్లను ఇలా ప్రోత్సహించాలని అనుకున్నా అని చెప్పడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.