Begin typing your search above and press return to search.

అటు ఈటలకు.. ఇటు బీజేపీకి.. అగ్ని పరీక్షే..!

By:  Tupaki Desk   |   29 Oct 2021 5:55 AM GMT
అటు ఈటలకు.. ఇటు బీజేపీకి.. అగ్ని పరీక్షే..!
X
తెలంగాణ బీజేపీకి కలిసొస్తున్న ప్రధాన అంశం.. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు దొరకడమే. తెలంగాణలో పార్టీల కంటే అభ్యర్థలను పట్టించుకుంటారని బీజేపీ నాయకులనే చూస్తే అర్థమవుతోంది. పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తలను గెలిపించే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు.. ఇలా వ్యక్తిగతంగా ఉన్న వారి బలాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. ఇప్పుడు కూడా బీజేపీకి ఈటల రాజేందర్ లాంటి అభ్యర్థి దొరకడం కొంత అనుకూలమే. ఓ వైపు రాష్ట్రంలో పట్టు సాధించాలని తపన పడుతున్న బీజేపీకి ఈటలను గెలిపించుకోవడం అవసరం . అటు ఈటల రాజేందర్ తాను ఎమ్మెల్యేగా గెలవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న సెంటిమెంట్ పనిచేస్తుందా..? అన్న చర్చ సాగుతోంది.

దాదాపు ఏ ఉప ఎన్నికకు లేనంతగా మూడు నెలలు ప్రచారం సాగింది హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఈటల రాజీనామా చేసిన తెల్లారి నుంచే అటు ఈటల రాజేందర్ ఇటు టీఆర్ఎస్ నాయకులు అప్పుడే ఉప ఎన్నిక అన్న విధంగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికీ 6 సార్లు ఓడిపోకుండా గెలిచిన ఈటల మరోసారి గెలుస్తాననే ధీమాతోనే రాజీనామా చేశానని చెప్పాడు. ప్రజలు తనవెంటే ఉన్నారని, తనను తప్పకుండా గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు. అయితే మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయబడ్డ ఈటల గెలిస్తే పార్టీపై వ్యతిరేకత వస్తుందని, అంతేకాకుండా పార్టీ ముఖ్యమని, పార్టీ తో ఎవరైనా గెలుస్తారన్న ధీమా టీఆర్ఎస్లో ఉంది.

కొన్ని రోజుల తరువాత టీఆర్ఎస్ గెలవడం అంత సులభం ఏం కాదని తెలిసింది. దీంతో అధికార పార్టీ ప్రత్యేక పథకాలతో పాటు బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపి ప్రచారం మొదలు పెట్టింది.ఇక మంత్రి హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించి గెలిచిపెట్టుకురావాలని కేసీఆర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో నెలరోజులగా హరీశ్ రావు ఇక్కడే మకాం వేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం కొనసాగించారు. అయనతో పాటు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విశ్రాంతి లేకుండా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే నియోజకవర్గంలో ఈటలకు వ్యక్తిగతంగా బలం ఉందని టీఆర్ఎస్ ముందే గ్రహించింది. ఈ నేపథ్యంలో దళిత బంధును ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని వర్గాలకు ప్రోత్సహాకాలు అందించడంతో ఈటలను వీడి టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈటల ఒక్కోసారి గెలుస్తారని ప్రచారం జరిగినా ప్రభుత్వం పథకాలకు ప్రజలు ఆకర్షితులైతే చెప్పలేమంటున్నారు.

ఇక ఈటల గెలుపు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా బీజేపీ భవిష్యత్తును కూడా నిర్ణయించే అవకాశం ఉందని అంటున్నారు. ఈటల గెలుపుతో ఇక బీజేపీ స్ట్రాటజీ మొదలైందని మరోసారి బీజేపీ నాయకులు ప్రచారం చేసుకునే వీలుంది. అటు ఈటల సైతం తనకు వ్యక్తిగతంగా బలం ఉందని నిరూపించుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఈటల గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే అంతకుమించి అన్నట్లు టీఆర్ఎస్ నాయకులు పోటా పోటీగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు ఈటల ఇన్నిరోజులు చేయలేని పనులు ఇప్పుడు టీఆర్ఎస్ చేయడం వల్ల కొంత సానుకూలత వచ్చిందని చర్చించుకుంటున్నారు.

కానీ బీజేపీ నాయకులు హుజూరాబాద్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నాయకలు జితేందర్ రెడ్డి సహా కీలక నాయకులు ఈటలకు మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం నియోజకవర్గంలోనే పర్యటించారు. గతంలో కీలక నాయకులు ఒకటి,రెండు రోజులుప్రచారం చేసి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి 5రోజులుగా ప్రచారం చేశారు. దీంతో ఈటల గెలుపు వారికి ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.