Begin typing your search above and press return to search.

వైఎస్ విజ‌య‌మ్మ‌కు ఇది న్యాయ‌మేనా?

By:  Tupaki Desk   |   9 Nov 2021 10:33 AM GMT
వైఎస్ విజ‌య‌మ్మ‌కు ఇది న్యాయ‌మేనా?
X
ఎన్ని చెప్పినా.. ఎక్క‌డ ఉన్నా.. ఏం చేసినా.. వైఎస్ కుటుంబం ఏపీ కి చెందిన‌దే! ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే కూడా! అంద‌రూ ఒప్పుకొనేది కూడా!! అప్ప‌ట్లో విజ‌య‌మ్మ‌, ఆమె కుమార్తె ష‌ర్మిల‌, కుమారుడు జ‌గ‌న్‌.. త‌న తండ్రి ఆశ‌యం అంటూ.. ఉమ్మ‌డి ఏపీ కోసం.. రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ధ‌ర్నాలు చేశారు. రెండు రాష్ట్రాలు క‌లిసి ఉంటేనే బెట‌ర్ అనే నినాదం కూడా వినిపించారు. అయితే.. కుమారుడు జ‌గ‌న్ ముఖ్య‌ మంత్రి అయిన త‌ర్వాత‌.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టారు. మ‌రో వైపు కుమార్తె ష‌ర్మిల‌ను.. ముఖ్య‌ మంత్రిని చేయాల‌ని విజ‌య‌మ్మ కం క‌ణం క‌ట్టుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

నిజానికి అటు కుమారుడు కానీ, ఇటు కుమార్తె కానీ.. రాజ‌కీయాల్లోకి రావ‌డం వెనుక‌.. వైఎస్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని నిల‌ బెట్టాల‌నే విజ‌య‌మ్మ కాంక్ష ఎక్కువ‌గా ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. నిజానికి ష‌ర్మిల రాజ‌కీయం తీసుకుంటే.. ఆమెకు ఏపీ తోనే అనుబంధం ఎక్కువ‌. పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కూడా తెలంగాణ‌ లో కంటే.. ఏపీ లోనే ష‌ర్మిల‌ను ఎక్కువ‌ గా ఆద‌రించారు. జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అని చెప్పుకొంటే.. తెలంగాణ‌ లో క‌న్నా.. ఎక్కువ‌గా ఏపీ లోనే ప్ర‌జ‌లు విన్నారు.. జై కోట్టారు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ష‌ర్మిల తెలంగాణ‌ లో సీఎం అయ్యేలా విజ‌యమ్మ తెర‌ చాటు మంత్రాంగం న‌డుపుతున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌.

నిజాని కి ష‌ర్మిల తెలంగాణ‌ లో వైఎస్సార్ టీపీని పెట్టినా.. ధ‌ర్నాలు చేసినా.. నిర‌స‌న వ్య‌క్తం చేసినా.. ఏ ఒక్క‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పైగా ఆమె చేసిన నిర‌స‌న స‌భ‌ల్లో త‌మ‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేదంటూ.. రోజు వారీ కార్మికులు ఆందోళ‌న కూడా చేశారు. అదేస‌మ‌యంలో ఎన్నో త్యాగాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణ విష‌యం లో ఈ ప్రాంత నేత‌లు.. ఏపీ కి చెందిన ష‌ర్మిల త‌మ‌ను పాలించాల‌ని కోరుకోవ‌డం లేదు. అన్నా చెల్లెళ్ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం.. రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌ గా మారి పోయేలా ష‌ర్మిల క్రియేట్ చేస్తున్నార‌నే ఆగ్ర‌హం కూడా ఉంది.

నిజానికి విజ‌య‌మ్మ విష‌యాన్ని తీసుకుంటే.. రాజశేఖరరెడ్డి 30 ఏళ్ల పై చిలుకు ప్రజాజీవితాన్ని గడిపారు. నిత్యం రాజకీయాల్లో తలమునక లై ఉన్నారు. కానీ ఏనాడూ ఆమె జోక్యం చేసుకున్న ప‌రిస్థితి లేదు. కానీ ఆయన మరణానంతరం ఏడాదిలోపు గానే యాక్టివ్ పాలిటిక్స్ లోకి విజయమ్మ వ‌చ్చారు. పులివెందుల నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. అది కూడా త‌న కోసం కాద‌నేది అంద‌రికీ తెలిసిందే. వైఎస్ సాధించిన సానుభూతి, ప్ర‌జాభిమానం వంటివి త‌మ కుటుంబానికి మాత్ర‌మే ప‌రిమితం కావాల‌ని.. దీనిని మ‌రెవ‌రో అనుభ‌వించ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌ల నేప‌థ్యం లోనే విజ‌యమ్మ రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించారు.

ఈ క్ర‌మం లోనే విభ‌జిత రాష్ట్రం ఏపీ లో త‌న కుమారుడిని సీఎం చేసుకునేందుకు.. అధికారం లోకి తెచ్చేందుకు అనేక ప్ర‌యాస‌లు ప‌డ్డారు విజ‌య‌మ్మ‌. ఇది పూర్త‌యింది. ఇక‌, ఇప్పుడు కుమార్తెను రాజ‌కీయం గా నిల‌దొక్కుకునేలా చేయాల్సిన బాధ్య‌త‌ను కూడా ఆమె తీసుకున్నారు. అయితే.. ఏపీ కి చెందిన ఈ కుటుంబం తెలంగాణ‌లో పావులు క‌ద‌ప‌డ‌మే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌. అన్నా చెల్లెళ్ల మ‌ధ్య త‌లెత్తిన రాజ‌కీయ వార‌స‌త్వ పోరు.. తెలంగాణ వ‌ర‌కు పాకింది. ఈ క్ర‌మం లోనే పార్టీ స్థాప‌న జ‌రిగింద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం.

మ‌రోవైపు.. కుమారుడు సీఎం అయ్యాడు. పోనీ.. అక్క‌డ ఏదైనా గౌర‌వ ప్ర‌ద‌మైన ప‌ద‌వి కానీ.. బాధ్య‌త‌లు కానీ.. ష‌ర్మిల‌ కు ల‌భించి ఉంటే.. ఇప్పుడు పార్టీ పెట్టే వారే కాద‌నే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేప‌థ్యం లో విజ‌య‌మ్మ తెలివిగా.. తెలంగాణ‌ వైపు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కానీ, ఇక్క‌డ ష‌ర్మిల‌ను ఆద‌రించేవారు ఎవ‌రు ఉన్నారు? క‌నీసం .. ఇప్ప‌టి వ‌ర‌కు వార్డు స్థాయి నాయ‌కులు కూడా పార్టీ లో చేర‌లేదు. పాద‌యాత్ర చేస్తున్నా.. ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోలేదు. ప్రత్యేక తెలంగాణ కు వ్యతిరేకిగా ముద్రపడిన వై.ఎస్. పేరుతో ఇక్కడ రాజకీయం చెల్లుబాటు అవుతుందా? వ్యక్తిగతం గా వై.ఎస్. కు అభిమానులు ఉండవచ్చు.

కానీ, రాజకీయం గా ప్రజానీకాన్ని ప్రభావితం చేసి అధికారం కోసం పోరాటం జరిపేంతటి బలం సాధ్యం కాదు. అయినా షర్మిల దీక్షలు, ఆందోళనల పేరిట ప్రధాన రాజకీయపార్టీల తరహా లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పాద‌యాత్ర చేస్తున్నారు. ఇవ‌న్నీ.. కూడా విజ‌య‌మ్మ నాయ‌క‌త్వం లో తెర‌ చాటు మంత్రాంగం తోనే న‌డుస్తున్నాయి. ఇవ‌న్నీ చూస్తున్న‌వారు.. ఇది న్యాయ‌మేనా విజ‌య‌మ్మా? అనే ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.