Begin typing your search above and press return to search.

మహా డీల్ ఇదేనా? పవార్ దెబ్బకు ఏదేదో అయ్యిందట

By:  Tupaki Desk   |   21 Nov 2019 6:55 AM GMT
మహా డీల్ ఇదేనా? పవార్ దెబ్బకు ఏదేదో అయ్యిందట
X
మహారాష్ట్రలో రాజకీయం అంతూపొంతూ లేదన్న రీతిలో సాగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరు ఎవరితో జత కడతారో అర్థంకానట్లుగా పరిణామాలు సాగుతున్నాయి. అధికారాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా అన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నించటం ఒక ఎత్తు అయితే.. ఈ విషయంలో ప్రధాని మోడీ సైతం పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. ఎత్తులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

దీనికి నిలువెత్తు నిదర్శనంగా మోడీ.. పవార్ ల మధ్య జరిగిన భేటీగా చెప్పక తప్పదు. బుధవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని.. ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ కావటంతో.. వీరి కాంబినేషన్ లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ప్రధానితో భేటీ అనంతరం మీడియాకు క్లారిటీ ఇచ్చిన పవార్.. తమ భేటీ కేవలం మహారాష్ట్రలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం మీద చర్చించేందుకేనని స్పష్టం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. విపక్ష నేతల్ని పిలిపించుకొని మరీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్య మీద ప్రధాని చర్చలు జరిపిన ఉదంతం మోడీ హయాంలో చోటు చేసుకుందా? అన్న క్వశ్చన్ వేసుకుంటే విషయం ఇట్టే అర్థం కాక మానదు.

ప్రధాని మోడీతో భేటీ అనంతరం పవార్ కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ కావటం విశేషం. అయితే.. సోనియాకు అత్యంత సన్నిహితులతో పవార్ మీటింగ్ తో మహారాష్ట్రలోని రాజకీయం ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. తాజాగా కుదిరిన డీల్ ప్రకారం శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ లతో కూడిన ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉందంటున్నారు. తొలుత రెండున్నరేళ్ల పాటు శివసేన అధ్యర్వ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని.. మిగిలిన రెండున్నరేళ్లు ఎన్సీపీ పవర్ లో ఉంటుందని చెబుతున్నారు. ఐదేళ్లు మాత్రం కాంగ్రెస్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నట్లు చెబుతున్నారు. ఈ ఫార్ములాకు సేనతో పాటు.. ఎన్సీపీ..కాంగ్రెస్ లు రెఢీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. సేన కంటే కూడా ఎన్సీపీ లబ్థి పొందినట్లుగా చెప్పక తప్పదు.