Begin typing your search above and press return to search.

ఇదేంది కేఏ పాల్? అనుమతి లేకుండా మహిళా వర్సిటీలోకి వెళ్లటమా?

By:  Tupaki Desk   |   3 Aug 2022 4:20 AM GMT
ఇదేంది కేఏ పాల్? అనుమతి లేకుండా మహిళా వర్సిటీలోకి వెళ్లటమా?
X
సంచలన వ్యాఖ్యలతో పాటు.. ఎప్పుడేం చేస్తారో అర్థంకానట్లుగా వ్యవహరించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అనూహ్యంగా వ్యవహరించారు. తిరుపతికి వచ్చిన ఆయన.. ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం లోపలకు సాయంత్రం ఆరు గంటల వేళకు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. పాల్ కు చెందిన ఐదు వాహనాలు వర్సిటీలోకి వెళ్లాయి. అనుమతి లేకుండా వర్సిటీలోకి వెళ్లటమే కాదు.. ఆయన వాహనాల్ని అడ్డుకున్న సెక్యురిటీపై చిందులు వేస్తూ.. లోపలకు వెళ్లిపోయారు.

విశ్వవిద్యాలయం వద్దకు నేరుగా వెళ్లిపోయిన ఆయన.. రోడ్డు మీద కార్లను ఆపారు. ఈ సందర్భంగా అటుగా వెళుతున్న విద్యార్థినులను పిలిచి వారితో మాట్లాడారు. సెల్పీలు దిగారు. విద్యార్థినులతో వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేయించి వారితో మాట్లాడటం ఆసక్తికకరంగా మారింది. ఎలాంటి అనుమతి లేకుండా మహిళా వర్సిటీలోకి వచ్చిన కేఏ పాల్ మీద సిబ్బంది ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

దీంతో ఆయన్ను స్టేషన్ కు రావాలని పోలీసులు కోరారు. అందుకు ససేమిరా అన్న ఆయన.. వస్తే తన కారులోనే వస్తానని చెప్పి.. తన వాహనంలోనే ఉండిపోయారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు మిన్నకుండిపోయారు.

కాసేపటికి పాల్ తన వాహనాలతో వెళ్లిపోయారు. అనంతరం అనుమతి లేకుండా విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించినందుకు పాల్ మీద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.

ఇటీవల కాలంలో పాల్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా ఉంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి అవుతానని..

ఏపీలో తమ పార్టీ గెలిచిన తర్వాత ఒక మహిళను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మహిళా వర్సిటీలోకి అనుమతి లేకుండా వెళ్లి ఈ హంగామా చేయటం ఏంది కేఏ పాల్ గారు? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.