Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీలో ఈ ఎమ్మెల్యేనేనా నెంబర్ వన్?

By:  Tupaki Desk   |   9 Jun 2022 7:30 AM GMT
వైఎస్సార్సీపీలో ఈ ఎమ్మెల్యేనేనా నెంబర్ వన్?
X
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ తన అస్త్రశస్త్రాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ప్రజలకు కలిగిన లబ్ధి గురించి నేరుగా ప్రజలకు వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నిర్వహించిన వర్కుషాపులో అనేక అంశాలు చర్చకొచ్చాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతమున్న 151 సీట్లను 175కు పెంచాలని.. తద్వారా 175కు 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్ జగన్ కర్తవ్య బోధ చేశారు.

అలాగే ప్రస్తుతం జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బాగా జరుగుతోందని వైఎస్ జగన్ నేతలను ప్రశంసించినట్టు సమాచారం. అయితే కొంతమంది మాత్రం సరిగా ప్రజల వద్దకు వెళ్లడం లేదని.. వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని జగన్ హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ హెచ్చరికలు అందుకున్నవారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని అంటన్నారు.

ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందరికంటే ముందు ఉన్నారని జగన్ మెచ్చుకున్నట్టు సమాచారం. వాస్తవానికి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టక ముందు నుంచే అంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్తున్నారు. నిత్యం ప్రజలే మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆయనను ప్రత్యేకంగా అభినందించినట్టు తెలిసింది.

ఇటీవల గుండెపోటుకు గురయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమావేశానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు కాలేదు.

దీంతో సీఎం జగన్ ఆయనతో ఫోన్ లో మాట్లాడి అభినందించినట్టు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ చాలా పటిష్టంగా ఉందని.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ నెల్లూరు రూరల్ ముందంజలో ఉందని సీఎం జగన్ మెచ్చుకున్నారని చెబుతున్నారు.