Begin typing your search above and press return to search.

ఇది మన ట్యాంక్ బండ్ యేనా?

By:  Tupaki Desk   |   23 Jan 2021 10:39 AM GMT
ఇది మన ట్యాంక్ బండ్ యేనా?
X
ఎన్నికల వేళ సహజంగానే కాసిన్ని అభివృద్ధి పనులు చేసి ఓట్లు దండుకునే ప్రయత్నాలకు అధికార పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే ఎన్నికలొస్తేనే సమస్యలు తీరుతాయని ప్రజలు కూడా భావిస్తూ అప్పటిదాకా ఎదురుచూస్తుంటారు.

ఈ క్రమంలోనే ఇటీవల జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ముందు ఐటి మంత్రి కేటిఆర్ ట్యాంక్ బండ్ చుట్టూ సుందరీకరణ పనులు చేయడంతోపాటు నైట్ బజార్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు కేటీఆర్‌ను విమర్శించాయి, జీహెచ్ఎంసీ ఎన్నిక నేపథ్యంలో ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్న ఎన్నికల స్టంట్ అని విమర్శించాయి.. పోల్స్ ముగిశాయి..అయితే జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు అనుకున్న ఫలితం అయితే దక్కలేదు. స్వల్పంగా ఆధిక్యాన్ని మాత్రమే గులాబీ పార్టీ సాధించింది.

ఎన్నికల కోసం చేసినా కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ పూర్తిగా మారిపోయింది. అభివృద్ధి పనులు పూర్తికావడంతో పునరుద్ధరించిన ట్యాంక్ బండ్‌ను చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు. ట్యాంక్ బండ్ ఫొటోలను షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ ప్రజలు, నెటిజన్ల అభిప్రాయాన్ని అడిగారు. “మీరు పునరుద్ధరించిన ట్యాంక్ బండ్ ను చూసి ఇష్టపడకుంటా ఉంటారా? దయచేసి మీ వ్యాఖ్యలు & సలహాలను పంచుకోండి. పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయి.. త్వరలో పూర్తవుతాయి ”అని కేటీఆర్ ట్వీట్ చేశారు. వీధి దీపాలకు పాతకాలపు డిజైన్ అద్భుతంగా ఉందని చూపించే ఫొటోలను కేటిఆర్ ట్వీట్ చేశారు.

ట్యాంక్ బండ్ కు వేసిన గ్రిల్స్ కూడా పాత పాఠశాలను గుర్తుకు తెచ్చేలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. హైదరాబాదీలు వాటిని చూసి అక్కడ ఫొటోలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ట్యాంక్ బండ్ అందాలను కెమెరాలో బంధిస్తూ షేర్లు చేస్తున్నారు. ఇంకా నైట్ బజార్ తోపాటు ఇతర పనులు పూర్తి కాలేదు. బహుశా వేసవి నాటికి నైట్ బజార్ పూర్తవుతుంది కావచ్చు. కానీ ఇప్పటికే సుందరంగా తయారైన ట్యాంక్ బండ్ అందాలు చూపు తిప్పుకోనివ్వకుండా ఆకట్టుకుంటున్నాయి.