Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య తేడా ఇదే.. అందుకే రాజధాని లేదా?

By:  Tupaki Desk   |   12 Sep 2022 7:55 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య తేడా ఇదే.. అందుకే రాజధాని లేదా?
X
ఒక రాష్ట్రానికి రాజధాని చాలా ముఖ్యం. ఘన చరిత్ర సొంతమని చెప్పుకునే ఆంధ్రోళ్లకు మాత్రం రాజధాని అన్నది అందని ద్రాక్షగానే మిగిలింది. వ్యక్తుల వల్ల కావొచ్చు.. రాజకీయం కారణంగా కావొచ్చు.. కారణం ఏదైనా సరే.. ఏపీకి రాజధాని నగరం లేదన్నది మాత్రం నిజం. ఎప్పటికప్పుడు ఏదో ఒక రాజధాని అసరాతో నడిచిన ఆంధ్రాకు ఇప్పుడు రాజధాని అవసరమైంది.

ఇంత కాలం పాటు ముడిపడని రాజధాని.. ఇప్పుడు ముడి పడిన తర్వాత కూడా ఏదో ఒక పీటముడి పడుతూ.. అసలుకే ఎసరు అన్నరీతిలో నడుస్తున్న వైనం చూస్తే.. ఎందుకిలా? అన్న ప్రశ్న మదిలో మెదులుతుంది. ఏపీ ప్రజలు సరిగా ఉండరా? రాజకీయ నేతలు వారిని సరైన దిశగా నడిచేలా చేయరా? అన్నది చూసినప్పుడు.. ప్రజల తీరుకు అనుగుణంగానే రాజకీయాలు ఉంటాయన్నది మర్చిపోకూడదు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నడుం బిగించిప్పుడు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్.. ఆ పార్టీ నేతలు ఎవరూ కూడా సానుకూలంగా లేరన్నది నిజం. కానీ.. తర్వాతి కాలంలో ఏమైందో అందరికి తెలిసిందే. కాదన్న పార్టీనే తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ గురించి సానుకూల ప్రకటన చేసేందుకు సైతం ఇష్టపడని నేతలు సైతం.. తమకు మించిన తెలంగాణ వాదులు ఇంకెవరు ఉన్నారంటూ నిందించటం చూశాం.

అంటే.. తెలంగాణలో ప్రజలు ఎజెండా సెట్ చేస్తారు. తమకున్న సామాజిక చైతన్యంతో నేతల్ని.. పార్టీలను నడిచేలా చేస్తారు. తాము అనుకున్నది సాధిస్తారు. ఈ కోణంలో చూస్తే.. ఏపీ ప్రజల్లో అలాంటివి తక్కువన్నట్లుగా అనిపించక మానదు. నిత్యం కులాల కుమ్ములాటలే తప్పించి మరింకేమీ ముఖ్యం కాదనే ఏపీ ప్రజల్ని.. తెలంగాణ ప్రజలతో పోల్చడం కూడా తప్పే అవుతుందేమో? ఒకే భాషను మాట్లాడే ఈ రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచనలు.. ఎమోషన్లు కాస్తంత వేరుగా.. తేడాగా ఉంటాయని చెప్పాలి.

తెలంగాణ.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజల్ని చూసినప్పుడు తెలంగాణ ప్రజలు భావోద్వేగంతో.. బయటకు తమ ఆశల్ని.. ఆకాంక్షల్ని చాటి చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటపడరు. అంతేకాదు.. తమ వేదనను పాట రూపంలో.. ఆట రూపంలో పంచుకుంటారు. కానీ.. ఏపీ ప్రజలు మాత్రం అందుకు భిన్నం. గుంభనంగా ఉంటారు. మనసులోని కోపాన్ని మాటల రూపంలో బయటకు తీసుకురారు. ఓట్ల రూపంలో చెప్పేస్తారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి.. ఆ పార్టీ మరో పాతికేళ్లకు కూడా కోలుకునే పరిస్థితి లేదు. ఆంధ్రా ప్రజల తీరు అలా ఉంటుంది.

అమరావతి విషయంలో ఏపీలోని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపే అంశం విజయవంతంగా పూర్తి అయ్యిందని చెప్పాలి. అమరావతిలో రాజధాని ఉండటం వల్ల మాకేంటి లాభమని సీమ జిల్లాల ప్రజల నుంచి ఉత్తరంధ్రా జిల్లాల వారు అనుకోవటం కనిపిస్తుంది. అంతదాకా ఎందుకు.. అమరావతి రాజధానిని దగ్గర్లోని ప్రకాశం జిల్లా వారు సైతం విచిత్ర వాదనల్ని వినిపించటం కనిపిస్తుంది. హైదరాబాద్ ను అంతకంతకూ పెంచేస్తున్నారు.. మా జిల్లాలకు ఏమీ చేయరేంటి? అన్న మాట తెలంగాణలోని ఏ జిల్లాల వారి నోటి నుంచి వినిపించదు.

నిజానికి ఒక రాజధానికి ఉండాల్సిన లక్షణాలు.. అవకాశాలు అమరావతికి చాలా ఉన్నాయి. 35 వేల ఎకరాల్లో మొదలయ్యే అమరావతి రాజధాని నిజంగా నిర్మితమైతే.. తర్వాతి కాలంలో దానికి అనుసంధానంగా ఇటు గుంటూరు తెనాలి వరకు.. అటు విజయవాడ దాటి ఏలూరు వరకు విస్తరించిపోయినా ఆశ్చర్యం లేదు. హైదరాబాద్ మహానగరం ఈ రోజున దాదాపు 4500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

దీనికి కారణం.. రాజధాని ఒకసారి టేకాఫ్ అయ్యాక.. దానికి తగ్గట్లుగా తమను తాము మల్చుకున్నారే తప్పించి.. హైదరాబాద్ అంతలా విస్తరించింది.. మా వరంగల్ ను ఎందుకు చిన్నచూపు చూశారు? మా కరీంనగర్ ను ఎందుకు పట్టించుకోలేదు. అన్నీ సంస్థలు హైదరాబాద్ లోనే ఉండాలా? హైకోర్టు అదిలాబాద్ లో.. సెక్రటేరియట్ మహబూబ్ నగరంలో ఏర్పాటు చేయొచ్చు కదా? లాంటి వాదనలకు చాలా దూరంగా ఉంటారు. అందుకే.. తెలంగాణ వెలిగిపోతుంటే.. ఏపీకి మాత్రం ఇప్పటికి రాజధాని లేకపోగా.. ఎప్పటికి వస్తుందన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.