Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఇదే అతి పెద్ద మైనస్సా?

By:  Tupaki Desk   |   15 July 2022 2:30 PM GMT
కాంగ్రెస్ కు ఇదే అతి పెద్ద మైనస్సా?
X
కాంగ్రెస్ పార్టీపైన జనాల్లో అభిమానముందన్నది వాస్తవం. ఇదే సమయంలో అపనమ్మకం కూడా బాగానే ఉంది. అభిమానాన్ని అపనమ్మకం డామినేట్ చేస్తుండటమే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్ గా మారింది. ఇంతకీ అపనమ్మకం ఏమిటంటే పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు ఏదో ఒకరోజు టీఆర్ఎస్ లోకి జంపయ్యేవారే అన్నది. గడచిన ఎనిమిదేళ్ళల్లో జరిగిందిదే. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది కేవలం 64 సీట్లుమాత్రమే.

ఉన్న 119 అసెంబ్లీ సీట్లలో ఉద్యమ నేతని, చావునోట్లో తలపెట్టానని తరచు తనగురించి తాను చెప్పుకునే కేసీయార్ నేతృత్వంలోని టీఆర్ఎస్ కు జనాలిచ్చింది కేవలం 64 సీట్లే. దాంతో తన ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవటం ఖాయమని భయపడ్డ కేసీయార్ వెంటనే టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేశారు. కేసీయార్ ఒత్తిళ్ళకు లొంగిపోయిన చాలామంది ఎంఎల్ఏలు టీఆర్ఎస్ లో చేరిపోయారు.

కేసీయార్ దెబ్బకు తెలంగాణాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ కూడా నానా అవస్తలు పడుతున్నది. ఈ నేపధ్యంలోనే 2018 ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున సుమారు 18 మంది గెలిచారు.

అయితే వీరిలో అత్యధికులు టీఆర్ఎస్ లోకి జంప్ చేసేశారు. తాము కాంగ్రెస్ పై అభిమానంతో ఓట్లేసి గెలిపిస్తే చివరకు ఎంఎల్ఏలు టీఆర్ఎస్ లో చేరటాన్ని జనాలు ఎందుకు సహిస్తారు ? అందుకనే తర్వాత జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనాలు ఓట్లేయలేదు.

మరి రేపటి జనరల్ ఎన్నికల మాటేమిటి ? కేసీయార్ పైన జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నది వాస్తవం. బీజేపీ అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేసేంత సీన్ లేదన్నదీ వాస్తవమే. ఇదే సమయంలో జనాలందరు కాంగ్రెస్ వైపే చూడాలి. కానీ తాము గెలిపించిన కాంగ్రెస్ ఎంఎల్ఏలు తర్వాత వెళ్ళి టీఆర్ఎస్ లో చేరరని గ్యారెంటీ ఏమిటని ఆలోచిస్తున్నారు.

అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక మార్పు ఉంది. అప్పట్లో కాంగ్రెస్ కి సింగిల్ ఫేస్ లేదు. ఇపుడు సింగిల్ ఫేస్ రేవంత్ రెడ్డి రూపంలో కనిపించింది. పార్టీకి ఒక నాయకత్వం ఉందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. మరి ఇది ప్రజల్లో మార్పును తెస్తుందా? ఏం చేస్తుంది అన్నది చూడాలి.