Begin typing your search above and press return to search.

య‌డ్యూర‌ప్ప సీఎం ప‌ద‌వికి ఆఖ‌రి రోజు అదేనా?!

By:  Tupaki Desk   |   22 July 2021 5:30 PM GMT
య‌డ్యూర‌ప్ప సీఎం ప‌ద‌వికి ఆఖ‌రి రోజు అదేనా?!
X
క‌ర్నాట‌క బీజేపీ రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. క‌న్న‌డ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌కు సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి తార‌స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. యెడ్డీని సీఎం సీటు నుంచి దింపేయాల‌ని చాలా కాలంగా పార్టీలోని ఓ వ‌ర్గం గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు ప‌లుమార్లు బీజేపీ అధిష్టాన్ని క‌లిసి వ‌స్తోంది. అయితే.. ఈ డిమాండ్ కు కాషాయ పెద్ద‌లు సానుకూలంగా ఉన్నార‌నే ప్ర‌చారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పుడు ఆ ముహూర్తం వ‌చ్చేసింద‌నే సంకేతాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. య‌డ్యూర‌ప్ప‌ను దింపేసే రోజు కూడా ఫిక్స్ అయ్యింద‌ని అంటున్నారు.

ఈ నెల 26వ తేదీతో క‌ర్నాట‌క‌లో బీజేపీ అధికారం చేప‌ట్టి రెండేళ్లు పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో రెండో వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప ప్లాన్ చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. దానికి ఒక్క రోజు ముందు అంటే.. 25వ తేదీన పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల‌కు విందు ఏర్పాటు చేశార‌నే ప్ర‌చారం బ‌హిరంగంగానే సాగింది. అయితే.. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. అది మొత్తం ర‌ద్దైపోయింద‌ట‌. విందులు, వినోదాలు ఏవీ లేవంటూ ప్ర‌క‌ట‌న కూడా జారీకావ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. 26వ తేదీన రెండేళ్ల పాల‌న‌పై 'సాధన' పేరుతో ఒక సాదాసీదా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తార‌ట‌. విధాన సౌధ‌లోని హాల్ లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ చీఫ్ విప్ సునీల్ కుమార్ ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు.

ఇదే స‌మ‌యంలో ఢిల్లీ నుంచి మంత్రి శ్రీరాములుకు పిలుపు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి అపాయింట్ లేకుండానే ఢిల్లీ బాట ప‌ట్టారు. క‌ర్నాట‌క నుంచే కాకుండా.. గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి జ‌గ‌దీష్ షెట్ట‌ర్ కూడా హుటాహుటిన అక్క‌డి నుంచే ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. ఇవ‌న్నీ చూసిన‌ప్పుడు ముఖ్య‌మంత్రి మార్పు ఖాయ‌మ‌నే చ‌ర్చ ధాటిగా మొద‌లైంది. ఎప్ప‌టి నుంచో వ్య‌తిరేక వ‌ర్గం చేస్తున్న డిమాండ్‌.. త్వ‌ర‌లో ఫ‌లించ‌బోతోంద‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌పై గ‌తంలోనే అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఆయ‌న‌ను దించేయాల‌ని సొంత పార్టీ నేత‌లే డిమాండ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. కొంద‌రు నేరుగానే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తూ వ‌చ్చారు. త‌ర‌చూ ఢిల్లీ వెళ్లి య‌డ్యూర‌ప్ప‌పై ఫిర్యాదులు చేస్తూ వ‌చ్చారు. అయితే.. అన్నీ సావ‌ధానంగా విన్న అధిష్టానం.. ముఖ్య‌మంత్రిని మార్చ‌డానికే సిద్ధ‌ప‌డుతోంద‌నే వార్త‌లు ఎప్ప‌టి నుంచో వ‌స్తున్నాయి. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం తుది ద‌శ‌కు చేరుకుంద‌నే ప్ర‌చారం జోరందుకుంది.

అయితే.. ఈ వార్త‌ల నేప‌థ్యంలో లింగాయ‌త్ లు య‌డ్యూర‌ప్ప‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. యెడ్డీని ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిస్తార‌నే ప్ర‌చారం రావ‌డంతో.. లింగాయ‌త్ లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. యెడ్డీని తొల‌గిస్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలోనే బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కూడా స్పందించారు. ఈయ‌న కూడా యెడ్డీకి మ‌ద్ద‌తుగా వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అంతేకాదు.. అధిష్టానాన్ని కూడా త‌ప్పుబ‌ట్టారు.

క‌ర్నాట‌క‌లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది య‌డ్యూర‌ప్ప‌నే అని అన్నారు. అయితే.. ఆయ‌న‌పై కొన్ని అభియోగాలు ఉన్న‌ప్ప‌టికీ.. యెడ్డీ ఎప్పుడూ ఎవ‌రికీ చంచాగిరీ చేయ‌లేద‌ని ఘాటుగా స్పందించారు. ఆయ‌న లేకుంటే.. క‌ర్నాట‌క‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేదే కాద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. క‌ర్నాట‌క‌లో బీజేపీ మ‌రోసారి అధికారం చేప‌ట్టాల‌న్నా.. య‌డ్యూర‌ప్ప‌నే ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు. ఎప్పుడూ ఇలాంటి త‌ప్పిదాల‌నే ఎందుకు చేస్తారు అంటూ అధిష్టానంపై ప‌రోక్షంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. మ‌రి, ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి మార్పు అనేది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుంది? అన్న‌ది చూడాలి.