Begin typing your search above and press return to search.

కొత్త రూ.50 నోట్లు రాబోతున్నాయా?

By:  Tupaki Desk   |   18 Aug 2017 1:43 PM GMT
కొత్త రూ.50 నోట్లు రాబోతున్నాయా?
X
గ‌త నవంబ‌రులో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా చిన్న నోట్ల కొర‌త ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ కొర‌త‌ను తీర్చేందుకు త్వ‌ర‌లో రూ.200 నోటును అందుబాటులోకి తేనున్న‌ట్లు ఆర్బీఐ అధికారికంగా ప్ర‌కటించింది. గ‌త డిసెంబ‌రులోనే కొత్త రూ.50, రూ.20 నోట్ల‌ను అందుబాటులోకి తెస్తామ‌ని ఆర్బీఐ అధికారికంగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ వాటి ముద్ర‌ణ గురించి ఎటువంటి స‌మాచారం ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల చేయ‌లేదు. అయితే, అనూహ్యంగా కొత్త రూ.50 నోట్ల ఫొటోలు ఇంట‌ర్నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దీంతో, త్వ‌ర‌లో కొత్త రూ.50 నోట్లు మార్కెట్ లోకి తెచ్చేందుకు ఆర్బీఐ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఆ నోట్లు ఆర్బీఐ ముద్రించిన‌వా? కావా? అన్న విష‌యంపై ఆర్బీఐ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

మ‌హాత్మాగాంధీ సిరీస్‌- 2015 త‌ర‌హాలోనే త్వ‌ర‌లో కొత్త రూ.50 నోట్ల‌ను ముద్రిస్తామ‌ని, వాటిపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ సంత‌కం ఉంటుంద‌ని ఆర్బీఐ 2016 డిసెంబ‌రులో అధికారికంగా ప్ర‌క‌టించింది. కొత్త నోటు సెక్యూరిటీ ఫీచ‌ర్స్ పాత నోటును పోలి ఉంటాయ‌ని తెలిపింది. అయితే, కొత్త‌గా ముద్రించిన‌ట్లు భావిస్తున్న నోట్లు లేత ఆకుప‌చ్చ‌ రంగులో ఉన్నాయి. ఈ నోట్ల‌పై గాంధీజీ బొమ్మ ఎడ‌మ చేతివైపు మ‌ధ్య‌లో ముద్రించారు. ఈ నోట్ల‌కు వెనుక వైపు ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఓ ప్ర‌ముఖ దేవాల‌యం చిహ్నం ముద్రించి ఉంటుంద‌ని అన‌ధికారిక స‌మాచారం. కొత్త రూ.50 నోట్ల ముద్ర‌ణ‌పై - ఆ ఫొటోల‌పై ఆర్బీఐ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్ర‌క‌టన చేయ‌లేదు.

కాగా, కొత్త‌గా చలామ‌ణీ అవుతున్న రూ.2000 నోటును కేంద్రం త్వ‌ర‌లో ర‌ద్దు చేయ‌బోతోంద‌ని వ‌దంతులు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, రూ.2000 నోట్లు రద్దు చేయబోతున్నారనే దానిపై వార్తలేమీ లేవని ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రూ.2000 నోట్ల ముద్రణను తగ్గించడమేది భిన్నమైన అంశమని, ఆ నోట్లపై మ‌రింత సమాచారం ఆర్బీఐనే ఇస్తుందని కూడా ఆయ‌న స్పష్టంచేశారు. మ‌రోవైపు, కొత్త‌గా రూ.1000 నోట్ల‌ను ముద్రించే యోచ‌న లేద‌ని, చిన్న నోట్ల ముద్ర‌ణ పైనే ఫోక‌స్ చేయ‌నున్నామ‌ని ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత దాస్ గ‌తంలో ప్ర‌క‌టించారు.