Begin typing your search above and press return to search.

ఆ మంత్రుల పదవుల్ని జగన్ పీకేయటం వెనుక అసలు లెక్క ఇదేనా?

By:  Tupaki Desk   |   26 April 2022 3:30 PM GMT
ఆ మంత్రుల పదవుల్ని జగన్ పీకేయటం వెనుక అసలు లెక్క ఇదేనా?
X
మంత్రి పదవులు ఇచ్చిన రోజునే రెండున్నరేళ్లు అయిపోయిన తర్వాత 90 శాతం కేబినెట్ ను మారుస్తానని చెప్పటం.. అందుకు భిన్నంగా కేవలం 55 శాతం (దగ్గర దగ్గర) మాత్రమే మార్చి మిగిలిన వారిని కొనసాగించారు. మంత్రి పదవులు కోల్పోయిన వారిలో తనకు అత్యంత సన్నిహితులే కాదు.. విపక్షాలపై విరుచుకుపడటంలో పలువురు మహా దూకుడుగా వ్యవహరించే వారు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విషయం ఏదైనా కానీ.. అవసరం ఉన్నా లేకున్నా అదే పనిగా చంద్రబాబు మీదా.. ఆయన కుమారుడు లోకేశ్ మీదా పెద్ద ఎత్తున విరుచుకుపడే మంత్రిగా కొడాలి నానికి పేరుంది. నోరు తెరిస్తే చాలు.. చంద్రబాబు ఇజ్జత్ ఇంత సింఫుల్ గా తీయొచ్చా? అన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి.

ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి.. అవసరం ఉన్నా లేకున్నా.. విరుచుకుపడుతూ వార్తల్లో నిలిచే మంత్రిగా పేర్నినాని ఉండేవారు. వీరే కాదు.. అనిల్ కుమార్ కావొచ్చు.. బాలినేని.. అవంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. మంత్రి పదవులు కోల్పోయిన వారిలో చాలా మంది విపక్షాలపై విరుచుకుపడటంలో ముందుగా ఉండేవారు. తన ప్రభుత్వానికి ఇంత దన్నుగా నిలిచి.. విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా మాటల్ని మాట్లాడే వారిని మంత్రి పదవి నుంచి తొలగించడానికి కారణం ఏమిటి? అన్న దానిపై చాలానే చర్చ జరిగింది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. మంత్రులుగా తొలగించిన నేతలంతా దాదాపు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లుగా సమాచారం.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లో భాగంగా ఎవరిని కేబినెట్ లో ఉంచాలి? మరెవరిని తొలగించాలి? అన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు చేసిన సీఎం జగన్.. వేర్వేరు సంస్థల చేత.. నిఘా వర్గాల నుంచి సేకరించిన వివరాలతో.. ప్రజాదరణ కోల్పోవటమే కాదు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న వారిని గుర్తించినట్లు చెబుతున్నారు.

ఇలాంటి నేతల్ని మంత్రులుగా ఉంచుకోవటం ద్వారా.. ఎన్నికల్లో ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవలేకపోయారన్న చెడ్డపేరు మూటగట్టుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశంతో వారిని వదులుకున్నట్లుగా తెలుస్తోంది.

మంత్రి పదవుల నుంచి వారిని రిలీజ్ చేయటం ద్వారా.. ఒక హెచ్చరికను ఇవ్వటంతో పాటు.. పదవి కోల్పోయిన వేళ.. వారంతా కసిగా పని చేయటం.. నియోజకవర్గంలోని ప్రజలకు మరింత అందుబాటులో ఉండటం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో వారు గెలిచే అవకాశాల్ని మెరుగుదల చేయాలన్న ప్లాన్ కూడా ఉందని చెబుతున్నారు. ఈ కారణంతోనే తనకు సన్నిహితంగా ఉన్నప్పటికీ.. వారి మేలుకోరి మంత్రి పదవుల నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. మరీ.. విషయాన్ని పదవులు కోల్పోయిన నేతలకు తెలిసిందా? అన్నది ప్రశ్నగా మారింది.