Begin typing your search above and press return to search.

మమత వ్యాఖ్యల మర్మం ఇదేనా?

By:  Tupaki Desk   |   21 Sep 2022 4:30 PM GMT
మమత వ్యాఖ్యల మర్మం ఇదేనా?
X
దేశం మొత్తం మీద నమ్మదగ్గ రాజకీయనేతలు ఎంతమందున్నారంటే మొదటి పేరు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతారు ? ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో ఎవరూ ఊహించలేరు. నాన్ బీజేపీ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని చెప్పి చాలా హడావుడి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటితోను చాలాసార్లు మాట్లాడి సమావేశాలు కూడా నిర్వహించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థికి మద్దతిప్పిచ్చుకోవటంలో మమత నూరుశాతం సక్సెస్ అయ్యారు. దాంతో మమత వైఖరిలో మార్పొచ్చిందనే అనుకున్నారు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మిగిలిన పార్టీలకు చెయ్యిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతివ్వడం ఇష్టంలేక ఏకంగా ఎన్నికనే బహిష్కరించారు.

నరేంద్ర మోడీతో మమతకు ఎక్కడో ఒప్పందం కుదిరిందన్న విషయం తర్వాత ప్రచారమైంది. మారిన రాజకీయ పరిణామాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చేసి మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కలిపే ప్రయత్నాల్లో ఉన్నారు.

బహుశా నితీష్ ప్రయత్నాలు నచ్చలేదేమో ఇపుడు మమత ప్రతిపక్షాలతో పెద్దగా కలవటం లేదు. పైగా మోడీని వెనకేసుకొస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ సీబీఐ, ఈడీ దాడులకు మోడీయే కారణమని గోలగోల చేస్తుంటే మమత మాత్రం దాడుల వెనుక మోడీ ఉన్నట్లు తనకు అనిపించటం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ లో ఉన్నవాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజకీయాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ లో ఉన్నట్లు మమత చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

నిజానికి మోడీని వెనకేసుకు రావాల్సిన అవసరం, ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం మమతకు లేదు. అయినా మాట్లాడుతున్నారంటే ఆమె వైఖరిలో ఎక్కడో తేడా వచ్చినట్లు కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం అనుమానిస్తున్నాయి.

బహుశా రేపు ఏదైనా సందర్భం చూసుకుని మోడీతో మమత చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పోకడల వల్లే మమతను ఎవరూ నమ్మరు. మమత ఎప్పుడు ఎవరికి మిత్రులుగా ఉంటారో ఎప్పుడు ఎవరికి శతృవులుగా మారుతారో ఎవ్వరూ చెప్పలేరు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.