Begin typing your search above and press return to search.

`ఉత్త‌రాంధ్ర వేదిక‌` టీడీపీకి క‌లిసి వ‌స్తుందా?

By:  Tupaki Desk   |   1 Sep 2021 2:30 AM GMT
`ఉత్త‌రాంధ్ర వేదిక‌` టీడీపీకి క‌లిసి వ‌స్తుందా?
X
ఉత్త‌రాంధ్ర‌. మూడు జిల్లాలను క‌లుపుతూ.. తీసుకువ‌చ్చిన నినాదం ఇది! విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల స‌మ‌స్య‌లు, ఇక్క‌డి వెనుక‌బాటుపై అనేక ఉద్య‌మాలు గ‌తంలో వ‌చ్చాయి. కొణ‌తాల రామ‌కృష్ణ నుంచి నేటి త‌రం నాయ‌కుల వ‌ర‌కు.. ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుపై ఉద్య‌మాలు చేసిన వారే. ముఖ్యంగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని అనేక ప్రాంతాలు ఇప్ప‌టికీ అభివృద్ధికి నోచుకోలేదు. క‌నీసం రోడ్డు క‌నెక్టివిటీ కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అనేక గిరిజ‌న గ్రామాలు ఇక్క‌డ మ‌రో ప్ర‌త్యేక‌త‌. అయితే.. ఆయా గిరిజ‌న గ్రామాల్లోనూ అభివృద్ధి జ‌రిగిందా? అంటే.. అనేక ప‌థ‌కాలు వ‌స్తున్నాయి.. పోతున్నాయి. కానీ, అభివృద్ధి మాటే లేదు.

టీడీపీ ఏం చేస్తోందంటే..

ఇదీ ఉత్త‌రాంధ్ర ప‌రిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ ఉత్త‌రాంధ్ర అభివృద్ధి అజెండాతో .. టీడీపీ కదం తొక్కేందు కు ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌పైదృష్టి పెట్టిన టీడీపీ.. ఆయా స‌మ‌స్య‌ల‌పై ఏ విధం గా పోరుబాట ప‌ట్టాల‌నే అంశంపై కీల‌క నేత‌లు.. చ‌ర్చ‌లు ప్రారంభించారు. స‌రే! ఈ చ‌ర్చ‌ల ద్వారా వ‌చ్చే ఫ‌లితం మేర‌కు వారుఉత్త‌రాంధ్ర‌పై ఎలా ముందుకు వెళ్తార‌నేది చూడాలి. ఇదిలావుంటే.. అస‌లు ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు పాపం ఎవ‌రిది? అనే ప్ర‌శ్న వ‌స్తే.. వేళ్ల‌న్నీ అన్ని పార్టీల వైపు చూపించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితివ‌స్తోంది. ఎందుకంటే.. ఏ పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఉత్త‌రాంధ్ర‌కు చేసింది ఏమీలేదు.

అస‌లేం జ‌రిగింది?

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు నీటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌. అదేస‌మ‌యంలో విద్య‌, వైద్యంలో చాలా వెనుక‌బాటులో ఉన్నారు. మౌలిక స‌దుపాయాల కొర‌త‌, మావోయిస్టు ప్ర‌భావం ఎక్కువ‌(ఇప్పుడు త‌గ్గింద‌ని చెబుతున్నారు) వీటిని పూర్తిగా తొల‌గించేందుకు మేం కృషి చేస్తాం అంటే.. మేం చేస్తాం.. అంటూ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్ని పార్టీలూ హామీలు ఇస్తూనే ఉన్నాయి. కానీ, గెలిచిన త‌ర్వాత‌.. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌డం లేదు. గ‌తంలో శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ స‌మ‌స్య‌ల‌ను జన‌సేన అధినేత ప‌వ‌న్ చొర‌వ‌తో.. అప్ప‌టి, ఇప్ప‌టి ప్ర‌భుత్వాలు కొంత మేర‌కు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. కానీ, మిగిలిన స‌మ‌స్య‌ల విష‌యాల‌కు వ‌చ్చే స‌రికి నువ్వు కార‌ణ‌మంటే.. నువ్వు కార‌ణ‌మంటూ.. దోబూచులాడుతున్నాయి.

సుజ‌ల స్ర‌వంతి ఏమైంది?

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు తాగు నీటిని అందించాల‌నే సంక‌ల్పంతో ఎన్టీఆర్ హ‌యాంలోనే రూప‌క‌ల్ప‌న జ‌రిగిన సుజ‌ల స్ర‌వంతి ప‌థ‌కం ఇప్ప‌టి వ‌ర‌కు రూపుదాల్చ‌లేదు. పైగా ఎప్ప‌టిక‌ప్పుడు దీనికి నిధుల గండంవెంటాడుతూనే ఉంది. గ‌తంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ కానీ, ఇప్పుడు అధికారం చేప‌ట్టిన వైసీపీ కానీ.. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం లేదు., ఇక‌, విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తార‌నే ప్ర‌తిపాద‌న ఉత్త‌రాంధ్ర‌కు మ‌రింత శాపంగా మారింది. ఈ విష‌యంలోనూ మీరు కార‌ణ‌మంటే.. మీరే కార‌ణ‌మ‌ని.. నాయ‌కులు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో విశాఖ రైల్వే జోన్ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టారు.

ఎవ‌రికి వారేనా?

ఉత్త‌రాంధ్ర అభివృద్ధి విష‌యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక విధంగా.. త‌ర్వాత మ‌రోవిధంగా పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌నే వాద‌న ఉంది. ఎవ‌రికి వారే.. ఈ విష‌యంలో త‌మ రాజ‌కీయ ల‌బ్ధిని చూసుకుంటున్నాయ‌నే కామెంట్లు ఉన్నాయి. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళంలో ఎక్కువ కాలం గెలిచిన పార్టీటీడీపీ. కానీ, గ‌త ఐదేళ్ల‌లో ఈ పార్టీ.. కేవ‌లం రాజ‌కీయ విన్యాసం చేసింద‌నే వాద‌న ఉంది. హుద్ హుద్ తుఫాను, తిత‌లీ తుఫాను వంటి స‌మ‌యాన్నిఅక్క‌డ చ‌ర్య‌లు చేప‌ట్టినా.. అవితాత్కాలికం, రాజ‌కీయం అన్న‌ట్టుగానే మారిపోయాయి. ఇక‌, ఇప్పుడు ఉత్త‌రాంధ్ర కోసం అంటూ.. ఉద్య‌మం మొద‌లు పెట్టారు. పోనీ.. ఇప్ప‌టికైనా.. మ‌న‌సు పెట్టి ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తే.. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.