Begin typing your search above and press return to search.

ఇది.. ఓటు బ్యాంకు రాజ‌కీయం కాదా చిన్న‌బాబు..!

By:  Tupaki Desk   |   26 May 2021 8:33 AM GMT
ఇది.. ఓటు బ్యాంకు రాజ‌కీయం కాదా చిన్న‌బాబు..!
X
టీడీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై తాజాగా టీడీపీలోనే సీనియ‌ర్ల మధ్య‌ జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఒక‌రిద్ద‌రు మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. చాలా మంది మాత్రం లోకేష్ వ్య‌వ‌హారంపై పెద‌వి విరుస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. విశాఖ డాక్ట‌ర్ సుధాక‌ర్ హ‌ఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని అనుకున్నారో.. ఏమోటీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. లోకేష్‌.

ఆ వెంట‌నే విశాఖ టూర్ పెట్టుకుని డాక్ట‌ర్ సుధాక‌ర్ ఇంటికి వెళ్లారు. ఈ క్ర‌మంలో కొద్ది మంది అనుకూల మీడియా ప్ర‌తినిధులు.. మ‌రికొంద‌రు చోటా నేత‌లు ఆయ‌న వెంట సుధాక‌ర్ ఇంటికి వెళ్లారు. ఈ క్ర‌మంలో.. లోకేష్‌.. డాక్ట‌ర్ సుధాక‌ర్ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరును తీవ్ర‌స్థాయిలో ఎండ‌గ‌ట్టారు. ఎస్సీలంటే..ఈ ప్ర‌భుత్వానికి లెక్క‌లేదు.. వ‌చ్చేది టీడీపీనే.. అప్పుడు లెక్క‌లు తీసి మ‌రీ.. కొంద‌రు అధికారుల‌ను శంక‌ర‌గిరి మాన్యాల‌కు పంపిస్తామ‌ని.. హెచ్చ‌రించారు.

అయితే.. లోకేష్ వ్య‌ఖ్య‌ల‌పై వైసీపీ నేత‌ల క‌న్నా.. కూడా టీడీపీ నేత‌లే భారీ ఎత్తున స్పందించ‌డం గ‌మ‌నా ర్హం. ఎందుకంటే.. కొన్ని రోజుల కింద‌టే.. పార్టీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి.. ప్రాణాలు కోల్పోయారు. మ‌రి ఆయ‌న చ‌నిపోయిన‌ప్పుడు ఇదే లోకేష్ ఎందుకు ప‌రామ‌ర్శ‌కు వెళ్ల‌లేదని.. ఇక్క‌డి నాయ‌కులు చెవులు కొరుక్కుంటున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ యువ నాయ‌కుడు వాన‌ప‌ల్లి ర‌వికుమార్ కూడా క‌రోనాతో మృతి చెందారు. ఈ కుటుంబానికి కూడా టీడీపీ నుంచి ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. వీరిద్ద‌రే కాదు.. టీడీపీలో ఇటీవ‌ల ప‌లువురు కీల‌క నేత‌లు మృతి చెందారు. వారంతా పార్టీ కోసం ద‌శాబ్దాలుగా ప‌నిచేశారు.

అయితే వీరిని చంద్ర‌బాబు, లోకేష్ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఇప్ప‌టికిప్పుడు డాక్ట‌ర్ సుధాక‌ర్ విష‌యంలో ఆఘ‌మేఘాల మీద‌ స్పందించ‌డం స‌రిగా లేద‌ని.. అంటున్నారు. నిజానికి ప్ర‌జ‌ల్లోకి స‌రైన సందేశం వెళ్లాలంటే.. పార్టీల ఉండి పెద్ద దిక్కును కోల్పోయిన సీనియ‌ర్ల కుటుంబాలను కూడా ప‌రామ‌ర్శిస్తే.. బాగుండేద‌ని, కానీ, కేవ‌లం ఎస్సీల ఓటు బ్యాంకు కోసం ఇలా చేయ‌డం స‌రికాద‌ని.. సొంత పార్టీలోనే సీనియ‌ర్లు గుస‌గుస లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చిన‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.