Begin typing your search above and press return to search.

ఏపీలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చేస్తున్న పని ఇదేనా?

By:  Tupaki Desk   |   4 Jan 2023 9:21 AM GMT
ఏపీలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చేస్తున్న పని ఇదేనా?
X
టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చి దేశ రాజకీయాల్లో తన సత్తా చూపాలని భావిస్తున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాజీ అఖిల భారత సర్వీసు అధికారులు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌ బాబు, చింతల పార్థసారథి వంటి వారిని బీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారు. ఈ క్రమంలో తోట చంద్రశేఖర్‌ ను ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా చేశారు. అలాగే రావెల కిశోర్‌ బాబు. బీఆర్‌ఎస్‌ జాతీయ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆశించిన ఫలితాలు సాధించాలని కేసీఆర్‌ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి పది ఇంటెలిజెన్స్‌ బృందాలు ఏపీలో తిరుగుతున్నట్టు టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు?, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఇలా వివిధ అంశాలను తెలంగాణ ఇంటెలిజెన్స్‌ బృందాలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అలాగే బీఆర్‌ఎస్‌ ఏపీలోకి ప్రవేశిస్తే ప్రజలు ఆదరిస్తారా? కేసీఆర్‌ పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? బీఆర్‌ఎస్‌ గురించి ఏమనుకుంటున్నారు ఇలా అన్ని విషయాలను తెలంగాణ ఇంటెలిజెన్స్‌ బృందాలు సేకరిస్తున్నట్టు టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే పది బృందాలు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాయని చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర తదితర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల నుంచి వివిధ అంశాలపై ఇంటెలిజెన్స్‌ బృందాలు సమాచారం సేకరిస్తున్నాయని అంటున్నారు.

గతంలో ఇలాగే ఏపీ ఇంటెలిజెన్స్‌ బృందాలు తెలంగాణలో పర్యటించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారిని అడ్డుకుంది. అయితే ఇప్పుడు అదే పనిని కేసీఆర్‌ ప్రభుత్వం ఏపీలో చేస్తోందని అని అంటున్నారు.

అయితే ఏపీలో జగన్‌ ప్రభుత్వంతో కేసీఆర్‌ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ బృందాలు నేరుగా రంగంలోకి దిగినా లేదంటే తమ అనుమతితో రంగంలోకి దిగినా జగన్‌ ప్రభుత్వానికి పెద్ద అభ్యంతరాలేమీ ఉండబోవని చర్చ జరుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.