Begin typing your search above and press return to search.

వీటికోసమే జగన్ ఢిల్లీ వెళుతున్నారా ?

By:  Tupaki Desk   |   6 Jun 2021 5:30 AM GMT
వీటికోసమే జగన్ ఢిల్లీ వెళుతున్నారా ?
X
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అందరిలోను ఆసక్తి పెరుగుతోంది. పర్యటన ఇంకా ఫైనల్ కానప్పటికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చర్చల సందర్భంగా ఏ ఏ అంశాలుంటాయనే విషయమై బాగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మూడు అంశాల మీద చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. మొదటిదేమో పోలవరం నిధులు, రెండోదేమో మూడు రాజధానులు+విశాఖకు పరిపాలనను తరలించటం, మూడోదేమో తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుపై వేటు వేసే అంశం.

పోలవరం నిధుల విషయమై చాలా రోజులుగా అయోమయం నెలకొంది. సవరించిన అంచనాల ప్రకారం గతంలో ఆమోదించిన మొత్తానికే కేంద్రం కట్టుబడి ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే 2013 అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం గట్టిగా చెబుతోంది. ఈ రెండు వాదనల మధ్య పోలవరం నిధుల అంశం నలుగుతోంది. ఇక తొందరలోనే విశాఖపట్నంకు పరిపాలనను తరలించాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఆ విషయాన్ని అమిత్ తో చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇక మూడో అంశం రఘురమది. తిరుగుబాటు ఎంపిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్ సభ స్పీకర్ కు నోటీసిచ్చి చాలా కాలమైనా ఎలాంటి యాక్షన్ లేదు. ఇది పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయం కావటంతో బీజేపీ-వైసీపీ మధ్య నలుగుతోంది. జగన్ తో కేంద్రానికి అవసరం అనుకుంటే ఎంపిపై వేటు పడుతుంది. లేకపోతే ఇలాగే ఇష్యూని స్పీకర్ లాగుతునే ఉంటారని అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్దితుల్లో ఎంపిపై వేటు వేయించటమన్నది జగన్ కు ప్రిస్టేజ్ గా మారింది.

ఇదే సందర్భంలో ఎంపిని అరెస్టు చేసిన దగ్గర నుండి జరిగిన డెవలప్మెంట్లను హోంమంత్రికి జగన్ వివరించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్పారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే జగన్ ఢిల్లీ ప్రోగ్రామ్ ఫైనల్ అయితేనే. అమిత్ షా అపాయిట్మెంట్ ఇవ్వగానే ఆదివారమే జగన్ బయలుదేరి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఢిల్లీకి వెళితే రెండు రోజులుండే అవకాశం ఉంది. మరి ఆదివారం ఏమి జరుగుతుందో చూడాలి.