Begin typing your search above and press return to search.

కోదంరాం కోరిక..కపిలవాయితో నెరవేరుతుందా.?

By:  Tupaki Desk   |   29 Oct 2018 10:16 AM GMT
కోదంరాం కోరిక..కపిలవాయితో నెరవేరుతుందా.?
X
కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీచేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసే టీజేఎస్ అభ్యర్థిని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కు టీజేఎస్ టికెట్ కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా దిలీప్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని కూడా ఆయనకు కట్టబెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ వైఖరి నచ్చకపోవడంతో దిలీప్ కుమార్ టీఆర్ఎస్ నుంచి వైదొలిగారు. తరువాత కాంగ్రెస్ - బీజేపీల్లో చేరారు. ప్రస్తుతం టీజేఎస్ లో కీలక నాయకుడిగా ఉన్నారు.

మల్కాజ్ గిరిలో బ్రాహ్మణ జనాభా ఎక్కువగా ఉంది. అదే సామాజికవర్గానికి చెందిన దిలీప్ కుమార్ కు ఇది కలిసివస్తుందని కోదండరాం పోటీకి దింపారట.. ఈ కోవలోనే బీజేపీ కూడా బ్రాహ్మణ వర్గానికే చెందిన రామచంద్రరావుకే మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమకాలంలో టీఆర్ ఎస్ అభ్యర్థుల గెలపు వ్యూహంలో దిలీప్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఈయన మంచి రాజకీయ వ్యూహకర్త, ప్రణాళికలు వేయడంలో దిట్ట. దీంతో టీజేఎస్ మల్కాజ్ గిరిలో జెండా ఎగురవేస్తుందని కోదండరాం గట్టి నమ్మకంతో ఉన్నారు.

దిలీప్ కుమార్ సోదరుడు కపిలవాయి రవీందర్ కూడా 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేసి ఓడిపోయాడు. మల్కాజ్ గిరిలో ఉన్న బ్రహ్మణ కుల సమీకరణలను పరిగణలోకి తీసుకొని కోదండరాం వేసిన ఈ ఎత్తుగడ ఫలిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే..